
పరమేశ్వరుడు.. శివుడు.. అర్దనారీశ్వరుడిగా అవతారం దాల్చాడు. అర్దనారీశ్వరుడు అంటే శరీరంలో సగభాగం పురుషుడు.. మరో సగభాగం స్త్రీ రూపంలో దర్శనమిస్తాడు. అలా భక్తులకు దర్శనం ఇవ్వడం ఒక్క శివయ్యకే సాధ్యమైంది. ఆయన ఎందుకు అలా ఎందుకు మారాల్సి వచ్చిందో పురాణాల ప్రకారం జరిగిన కథ గురించి తెలుసుకుందాం. . .
అసలు సిసలైన స్త్రీవాది .. పరమేశ్వరుడు..
సాధారణంగా, శివుడంటే, ఉత్కృష్టమైన పురుషత్వానికి ప్రతీక. కానీ ఆయనను అర్ధనారీశ్వరుడిగా చూసినప్పుడు, ఆయనలో అర్ధభాగం ఒక సంపూర్ణమైన స్త్రీ రూపం కదా.. !
శివుడు పరమానంద పారవశ్య స్థితిలో ఉండేవాడు. ఆ స్థితిలో ఆయనను చూసి పార్వతి ఆయన పట్ల ఆకర్షితురాలైంది. ఆయన ప్రేమను పొందేందుకు ఎంతో కష్టపడింది. ఎంతో సహాయం కోసం ఎదురుచూసింది. చివరకు వాళ్ళు పెళ్లిచేసుకొన్నారు.
పెళ్లయిన తరువాత సహజంగానే శివుడు, తన అనుభవాలన్నీ ఆమెతో పంచుకోవాలనుకొన్నాడు. మీలో మీరు రమిస్తూ, నిత్యం అనుభవించే ఈ ఆనంద పారవశ్య స్థితి నాకూ అనుభవించాలని ఉంది. అందుకు నేనేం చేయాలో చెప్పండి. దానికోసం ఎలాటి తపస్సు చేయటానికైనా నేను సిద్ధమే అన్నది పార్వతి.
అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి... నీవు గొప్ప తపస్సేమీ చెయ్యక్కర్లేదు. ఊరికే వచ్చి నా ఒడి లో కూర్చో చాలు... అన్నాడు. పార్వతి వచ్చి నిస్సంకోచంగా ఆయన ఒడిలో ఎడమపక్క కూర్చొంది. ఆమె అలా వెంటనే ఇష్టపూర్వకంగా వచ్చి.. తనను తాను అలా నిస్సంకోచంగా సమర్పించుకోవటంతో, శివుడు ఆమెను తనలోకి తీసుకొని తన శరీరంలో అర్ధ భాగంగా మార్చుకొన్నాడు.
ఆమెను తన శరీరంలో అర్థభాగంగా చేసుకోవాలంటే, శివుడు, తన శరీరంలో సగాన్ని త్యాగం చేయాలి కదా? ఆయన అలా తన శరీరంలో సగ భాగం వదిలివేసుకొని, ఆమెకు తనలో చోటు కల్పించాడు. ఇది అర్ధ నారీశ్వరుడి కథ ఇది.
ALSO READ | Maha Shivratri 2025 : శివరాత్రి వత్రం ఏంటీ.. ఎలా చేయాలి.. నియమాలు ఏంటీ తెలుసుకోండి..!
పురుషత్వమూ, స్త్రీతత్వమూ రెండూ సమభాగాలుగా నీలోనే దాగి ఉంటాయని చూపే కథ ఇది. ఆమెను తనలో చేర్చుకొన్నతరువాత శివుడు మళ్ళీ పరమానంద పరవశుడయ్యాడు.
అంతర్గతంగా పురుషత్వ, స్త్రీత్వాలు రెండూ కలిస్తే, ఎవరైనా నిరంతర పరమానంద పారవశ్యంలో ఉండిపోతారు. ఇది బాహ్యంగా చేయాలని ప్రయత్నిస్తే మాత్రం, అది ఎక్కువ కాలం నిలవదు. దాంతో వచ్చే సమస్యలన్నీ ఒక అంతులేని నాటకంగానే మిగిలిపోతాయి. అందుకే ఈనాటికి కూడా అర్దనారీశ్వరుడిని కొలుస్తూ పూజలు చేస్తున్నాం.. శివరాత్రి పర్వదినాన ఆ స్వామికి.. పార్వతిదేవికి వాడ వాడలా కళ్యాణం జరుపుకుంటున్నాం..
–వెలుగు, లైఫ్–