కేజ్రీవాల్‎కు భారీ షాక్.. ఒకేసారి ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా

కేజ్రీవాల్‎కు భారీ షాక్.. ఒకేసారి ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల ముందు ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్‎కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు నరేష్ కుమార్, రోహిత్ కుమార్, రాజేష్ రిషి, మదన్ లాల్, పవన్ శర్మ, భావా గౌడ్ ఆప్‎కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను ఆప్ అధినేత కేజ్రీవాల్‏కు పంపారు. 

రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మె్ల్యేలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ కారణాలతో ఆప్ టికెట్ నిరాకరించింది. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకేసారి ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం దేశ రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆప్‎తో బంధం తెంచుకున్న ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సరిగ్గా ఎన్నికలకు ఐదు రోజుల ముందు ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆప్‎కు భారీ ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం ఎన్నికల్లో ఆప్ విజయావకాశాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆప్ అధినేత కేజ్రీవాల్ సర్శశక్తులు ఒడ్డుతున్న తరుణంలో పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేయడం ఆప్‎కు ఇబ్బందికరంగా మారింది.  

Also Read :- త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 70 స్థానాలకు సింగల్ ఫేజ్‎లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. రెండు  పర్యాయాలుగా తిరుగులేని విజయం సాధించిన ఆప్.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి ఎలాగైన దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో వరుసగా దశాబ్ధం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. హస్తినాలో తిరిగి పునర్వైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఆప్, కాంగ్రెస్, బీజేపీల ట్రయాంగిల్ పోరుతో ఢిల్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరీ ఢిల్లీలో ఈ సారి ఏ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు ఆగాల్సిందే.