హైదరాబాద్ : మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు రోజుల క్రితం మొండెం లేని తల కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. మొండెం లేని తల కేసులో చనిపోయిన మహిళ ఎర్రం అనురాధగా గుర్తించారు. కేర్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుందని పోలీసులు చెప్పారు. ఇదే విషయాన్ని మృతురాలి సోదరి, బావ ధృవీకరించారు. మృతురాలు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు.. డబ్బు విషయంలోనే గొడవలు జరిగి హత్యకు గురైనట్లు ఆమె సోదరి వెల్లడించారు.
అనురాధను చంపిన తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి, నిందితుడు ఫ్రీజ్ లో దాచాడని పోలీసులు గుర్తించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసి, మూసీలో మొండెం వేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగింది..?
తీగలగూడ మూసి పరివాహక ప్రాంతంలో ఆరు రోజుల క్రితం ఒక నల్లటి కవర్ లో గుర్తు తెలియని మహిళ తల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మలక్ పేట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ , డాగ్ స్క్వాడ్ లతో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
అడిషనల్ డీసీపీ ఆనంద్, మలక్ పేట ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, మలక్ పేట, చాదర్ ఘాట్ క్రైం సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీగలగూడ మూసి పరివాహక ప్రాంతంలో మహిళ తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును చేధించేందుకు ఎనిమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. దర్యాప్తు ముమ్మరం చేశాయి.
పోలీసుల అదుపులో నిందితుడు
నిందితుడు చంద్రమోహన్ గా గుర్తించారు. గతంలో అనురాధ వద్ద 7 లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నాడని, డబ్బులు అడగడంతో ఆమెను చంద్రమోహన్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. మృతురాలు అనురాధ ఇదే ఇంట్లో కిరాయికి ఉంటుందని గుర్తించారు. చంద్రమోహన్ ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తాడని చెప్పారు. అనురాధ ఒంటరి మహిళ. చైతన్యపురిలోని చంద్రమోహన్ ఇంట్లో అనురాధ డెడ్ బాడీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అన్ని ఆధారాలను క్లూస్ టీం సభ్యులు సేకరిస్తున్నారు.