
- 8 మంది ప్రాణాలపై సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు
- ప్రభుత్వ వైఫల్యంతోనే రెస్క్యూ లేట్
- ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు మొదలుపెట్టారు
- టన్నెల్ దగ్గరికి వచ్చేందుకు సీఎంకు టైమ్ లేదా? అని ఫైర్
ఎస్ఎల్‌బీసీ, వెలుగు టీమ్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే రెస్క్యూ ఆపరేషన్ఆలస్యమవుతున్నదని మండిపడ్డారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి, కార్మికులను రక్షించాలని కోరారు. ‘‘ఆరు రోజులు సమయాన్ని వృథా చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న బాధితులకు మంచినీళ్లు, ఫుడ్ మాటేంటి?” అని ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను హరీశ్‌రావు గురువారం సందర్శించారు. అనంతరం అక్కడ మీడి యాతో మాట్లాడారు. వివిధ రెస్క్యూ టీమ్స్‌ను సమన్వయం చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని హరీశ్విమర్శించారు. ఏ టీమ్ ఏ పని చేయాలో స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆపరేషన్ చేపట్టిన ఆరు రోజుల తర్వాత తట్టెడు మట్టి తెచ్చారని కామెంట్ చేశారు. ఇట్లయితే లోపల ఉన్న వాళ్ల ప్రాణాలు ఏమవుతాయి? అని ప్రశ్నించారు.
‘‘ఇదేమైనా టూరిస్ట్ స్పాటా? మంత్రులు పొద్దున వస్తున్నారు.. సాయంత్రం వెళ్లిపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎలక్షన్ప్రచారానికి పోతున్నాడు” అని ఫైర్ అయ్యారు. ‘‘కన్వేయర్ బెల్టు పని చేయడం లేదు. దాన్ని గంటల్లో రిపేర్చేయవచ్చు. దాంతో మట్టి మొత్తం బయటకు తీసుకురావచ్చు. ఇంత చిన్న రిపేరు కూడా ఎందుకు లేట్ అవుతున్నది? రాళ్లు పడి టీబీఎం మిషిన్ పార్ట్స్ శిథిలమయ్యాయి. అది కట్ చేయాలా? వద్దా? అని నిర్ణయించడానికి ఐదారు రోజుల టైమ్ పడుతుందా? డీవాటరింగ్, కన్వేయర్ బెల్టు రిపేర్లు తొందరగా చేస్తే బురద మొత్తం బయటకు తీసుకురావచ్చు” అని అన్నారు.
సలహాలు, సూచనలు ఇద్దామనుకుంటే తమను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదని, టన్నెల్ లోపలికి వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. ‘‘నాతో పాటు వచ్చిన లీడర్లను అడ్డుకున్నారు. మొదట ఎనిమిది, పది మందిని మాత్రమే పంపిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఐదుగురే పోవాలి.. ఒక్కరే పోవాలంటూ ఆపేశారు. మేం వస్తున్నామని మీడియాను కూడా బయటకు పంపించారు. చివరకు ధర్నా చేస్తే లోపలికి పంపించారు” అని చెప్పారు.
జీఎస్ఐ రిపోర్టు బయటపెట్టండి..
సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే టన్నెల్కూలిందని మంత్రి ఉత్తమ్ చెప్పడం సిగ్గుచేటు. ఇప్పుడు టన్నెల్కూలడానికి గత ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకున్నారా? వాళ్లు ఏం జాగ్రత్తలు తీసుకొమ్మని చెప్పారు? ఆ రిపోర్ట్ బయటపెట్టండి” అని డిమాండ్ చేశారు.
ఏపీ నీళ్లు ఎత్తుకపోతున్నా స్పందిస్తలే..
కాంగ్రెస్ 14 నెలల పాలనలో పెద్దవాగు, వట్టెం, మిడ్ మానేరు, ఎస్ఎల్‌బీసీ.. నాలుగు ప్రాజెక్టులు కూలిపోయానని హరీశ్అన్నారు. ‘‘శ్రీశైలం మొత్తం ఖాళీ అయిపోయినా ప్రభుత్వం నిద్రపోతున్నది. ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా ఆపే ప్రయత్నం చేయడం లేదు. బనకచర్ల లింకుతో గోదావరి జలాలను కూడా ఎత్తుకుపోవాలని ఏపీ చూస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకుండాపోయింది” అని ఫైర్ అయ్యారు.
సీఎంకు టైమ్ లేదా?
టన్నెల్‌లో ప్రమాదం జరిగితే, వచ్చి చూసే టైమ్ కూడా సీఎం రేవంత్‌రెడ్డికి లేదా? అని హరీశ్ ప్రశ్నించారు. ‘‘సీఎం ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌లో పోతే, హెలికాప్టర్ లేదని మరో మంత్రి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద స్థలానికి రాలేదు. సీఎంకు టన్నెల్‌లో చిక్కుకున్నోళ్ల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా?” అని నిలదీశారు. ఈ ఘటనపై సీఎం కనీసం సమీక్ష చేయలేదని, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.