మహారాష్ట్ర, హర్యానాల్లో ఎలక్షన్ సందడి షురూ

మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. లోక్ సభ ఎన్నికల తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. దీంతో లోక్ సభ ఎన్నికల్లో  ప్రదర్శించిన దూకుడును మళ్లీ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో చూపించాలని బీజేపీ ఉత్సాహపడుతోంది. బీజేపీకి బ్రేక్​ వేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. లోక్​సభ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మధ్య ఈ ఆరు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఇవే విజేతలను నిర్ణయిస్తాయి.

1. ఆర్టికల్ 370 రద్దు

జమ్మూ కాశ్మీర్ కు కొన్నేళ్ల పాటు ప్రత్యేక అధికారాలు కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఆర్టికల్ 370 రద్దు బీజేపీకి పొలిటికల్​గా మంచి మైలేజ్ ఇచ్చింది. కాంగ్రెస్ లీడర్లు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వెల్ కం పలికారు. సామాన్య ప్రజలైతే రాజకీయాలకతీతంగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచారు. కాశ్మీర్ ఇప్పటికైనా అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు.

2. ట్రిపుల్ తలాక్ రద్దు

ముస్లిం మహిళల వైవాహిక హక్కులకు సంబంధించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఎన్నికలివి. ముస్లిం మహిళల జీవన పరిస్థితులను మెరుగు పరచడానికి మోడీ ప్రభుత్వం ఎంతో సాహసంతో ఈ నిర్ణయం తీసుకుందని దేశంలోని ఆడవారంతా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో రెండు  రాష్ట్రాల్లోని ముస్లిం ఆడవారంతా తమకు అండగా నిలబడతారని బీజేపీ లీడర్లు ధీమాతో ఉన్నారు.

3. కాంగ్రెస్ చీఫ్ గా తప్పుకున్న రాహుల్

రాహుల్ గాంధీ మేలో కాంగ్రెస్ చీఫ్ పోస్టుకు రాజీనామా చేశారు. దాదాపు మూడు నెలల పాటు కాంగ్రెస్ కు చీఫ్ అంటూ ఎవరూ లేరు. తర్వాత ఆగస్టులో సీడబ్లూసీ ప్రత్యేకంగా సమావేశమై సోనియాగాంధీని తాత్కాలిక  చీఫ్​గా ఎన్నుకుంది.

4. దేశం గుమ్మంలో ఆర్థిక మాంద్యం

దేశంలో  ఆర్థిక మాంద్యం ప్రవేశించిన తర్వాత జరగబోతున్న ఎన్నికలు ఇవి. ఎకనమిక్  స్లో డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడిందని ఎకానమిస్టులు అంటున్నారు. ఆర్థిక మాంద్యాన్ని  ఎన్నికల ప్రచార అంశంగా చేసుకోవడానికి  బీజేపీయేతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

5. ప్యాకేజీల వెల్లువ

మాంద్యం అంచుల్లోనుంచి దేశాన్ని బైటికి తీసుకురావడానికి అనేక ప్యాకేజీలు ప్రకటించారు. కార్పొరేట్​ట్యాక్స్​ తగ్గింపు, అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గింపు, రియల్ఎస్టేట్​కు రాయితీల వంటి ప్యాకేజీలు వచ్చాయి.

6.బ్యాంకుల విలీనం

ఆర్థిక సంస్థలను సంస్కరించడంలో భాగంగా  బ్యాంకులను విలీనం చేసింది కేంద్రం. 10 బ్యాంకులను కలిపేసి నాలుగుగా చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో కేవలం 12 మాత్రమే జాతీయ బ్యాంకులు ఉంటాయి.

మహారాష్ట్ర

కూటమితో కూటమి

మహారాష్ట్రలో  రెండో టర్మ్ కూడా అధికారం లోకి రావడానికి బీజేపీ పక్కా ప్లానుతో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మెట్రోలైన్ ప్రాజెక్టులతో ప్రజలకు దగ్గరకావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

మహారాష్ట్రలో  మొత్తం అసెంబ్లీ సీట్లు 288. కిందటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 112 సీట్లు గెలుచుకోగా శివసేన 63 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా ఒక దశలో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేస్తాయని భావించారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా చొరవతో బీజేపీతో కలిసి పోటీ చేయడానికి శివసేన అంగీకరించింది. సీట్ షేరింగ్ పై  ఆదివారం ఓ ప్రకటన చేస్తామని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.

మహా జన దేశ్ యాత్రతో..

మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, శివసేన ప్రభుత్వమే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల కిందటి నుంచే బీజేపీ పకడ్బందీ ప్లాన్లు వేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘ మహా జనదేశ్ యాత్ర ’ ప్రారంభించారు. ఈ యాత్రతో సీఎం ఫడ్నవీస్.. పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లగలిగారు.

మౌలిక సదుపాయాలే బీజేపీ అస్త్రాలు

ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించి ఓట్లు రాబట్టుకోవాలని ఫడ్నవీస్ ప్రభుత్వం భావిస్తోంది. చాలా రోజుల ముందటే దీనికి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. మెట్రో లైను ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిసైడయింది. మూడు మెట్రో లైన్లను అప్పటికప్పుడు ఓకే చేసింది.

వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు చర్యలు

మరఠ్వాడా ప్రాంతం అంటేనే నీటి కొరతకు పేరు.అలాంటి  ప్రాంతంలో  ప్రజలకు నీళ్లు అందించడానికి  ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఔరంగాబాద్, జల్నా జిల్లాల్లో వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకుంది. మరఠ్వాడా ప్రాంతంలోని  అనేక డ్యాంలను వాటర్ గ్రిడ్ కు కనెక్ట్ చేసి గ్రామాలకునీళ్లు అందించాలన్నది ఫడ్నవీస్ సర్కార్ ప్లాన్. దీంతో మరాఠ్వాడా ప్రాంతం మొత్తం తమకు అండగా ఉంటుందని బీజేపీ కూటమి భావిస్తోంది.

కాంగ్రెస్ కూటమి ఆయుధాలివే..

ఆర్థిక మాంద్యం, రైతు సమస్యలే ఆయుధాలుగా ఎన్నికల గోదాలోకి దిగబోతోంది కాంగ్రెస్ కూటమి. ఎకనమిక్ స్లో డౌన్ దెబ్బకు ఆటో ఇండస్ట్రీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షం ఎన్సీపీతో కలిసి పోటీ చేస్తోంది. యాత్రల పేరుతో ప్రజల్లోకి దూసుకుపోతున్న  బీజేపీకి చెక్ పెట్టడానికి  రైతుల సమస్యలను ప్రస్తావించాలని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి భావిస్తోంది. అలాగే చదువుకున్న కుర్రకారుకు కొలువులు దొరకని పరిస్థితిని ఎన్నికల ప్రచారంలో లేవనెత్తాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి కాంగ్రెస్ 42 సీట్లు, ఎన్సీపీ 41 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి.

హర్యానా

అపొజిషన్​ పార్టీలు తలోదిక్కున

హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్.. జన్ ఆశీర్వాద్ యాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. ఈ యాత్రలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో బీజేపీ లీడర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెల్లాచెదురు కావడం కూడా అధికార పార్టీకి ప్లస్ పాయింట్​గా మారింది.

హర్యానాలోని కోటీ 82 లక్షల మంది ఓటర్లు సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్​ ఐదేళ్ల పాలనపై అక్టోబర్​ 21న తీర్పు ఇవ్వనున్నారు. అసోం మాదిరిగానే ఎన్​ఆర్​సీ ప్రక్రియను హర్యానాలోనూ చేపడతామని ఆయన పోయిన వారం చెప్పారు. దీంతో ఈ ఎన్నికల్లో మేజర్​ పొలిటికల్​ ఇష్యూస్​లో ఎన్​ఆర్​సీ కూడా ఒకటి కానుందని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్​ రాకముందే ఈ రాష్ట్రంలో ఎలక్షన్​ క్యాంపెయిన్​ జోరుగా మొదలైంది. ఎన్​ఆర్​సీని సాకుగా చూపి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేసే ఛాన్స్​ ఉంది.

‘ఎన్​ఆర్​సీ’పై జనం ఏమంటారో?

హర్యానాలోకి దొడ్డి దారిన వచ్చిన వలసదారులు స్థానికుల ఉద్యోగావకాశాలకు గండికొడుతున్నారనే వాదన తరచూ వినిపిస్తోంది. ఈ సమస్యకు ఎన్​ఆర్​సీ ప్రాసెసే సరైన పరిష్కారమని బీజేపీ చెబుతోంది. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటే తప్ప ఇది ఒక కొలిక్కి రాదనే విషయం ప్రజలకు తెలుసని, అందుకే వాళ్లు మళ్లీ తమ పార్టీకే ఓటేస్తారని బీజేపీ నాయకులు నమ్మకంగా ఉన్నారు. జనం ఏ పార్టీ వైపు ఉన్నారనేది అక్టోబర్​ 24న గానీ తేలదు. హర్యానాలో హస్తం పార్టీ రీగ్రూపింగ్​పై దృష్టి పెట్టింది. పార్టీని వీడి వెళ్లిపోయినవారిని తిరిగి రావాలని కోరుతోంది. ముఠాలుగా విడిపోయినవాళ్లు ఒక్క తాటిపైకి వస్తే అధికారం పొందటం పెద్ద కష్టం కాదని లీడర్లను, కేడర్​ను ఉత్సాహపరుస్తోంది. స్టేట్​ కాంగ్రెస్​ ఎలక్షన్​ ఇన్​ఛార్జ్ గులాం నబీ ఆజాద్​, ఎలక్షన్​ కమిటీ చీఫ్​ భూపేందర్​ హుడా, పీసీసీ చీఫ్​ సెల్జా ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గా​ల్లో​ పర్యటిస్తూ స్థానిక నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

రేసులో లేని రీజనల్​ పార్టీలు

హర్యానాలోని ప్రాంతీయ పార్టీలు అధికార, జాతీయ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా లేకపోవటం వల్ల వాటి ఉనికే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ కాంగ్రెస్​ మాత్రమే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలదని తేల్చిచెబుతున్నారు. ఈమధ్య నలుగురు ఐఎన్​ఎల్​డీ ఎమ్మెల్యేలతోపాటు ఇండిపెండెంట్​ శాసన సభ్యుడు చేరటంతో హస్తం పార్టీ మళ్లీ పుంజుకుందనే టాక్​ వినిపిస్తోంది. మొత్తం 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు కైవసం చేసుకొని అధికారం చేపట్టింది. 19 మంది సభ్యులను గెలిపించుకున్న బలమైన లోకల్​ పార్టీ ఐఎన్​ఎల్​డీ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. 15 సీట్లతో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు ఆ రీజనల్​ పార్టీ కన్నా హస్తం పార్టీయే చాలా యాక్టివ్​గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఎన్​ఎల్​డీ చీలటంతో వీకైంది.