తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి: టీటీడీ చైర్మన్ BR నాయుడు

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి: టీటీడీ చైర్మన్ BR నాయుడు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అన్నారు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు  ఒక్కసారిగా దూసుకొచ్చారని.. దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని.. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. 

ALSO READ | తిరుపతిలో నలుగురు భక్తులు మృతి.. తొక్కిసలాటకు కారణం ఇదేనా..?

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో విష్ణునివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రంలో  తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. 

మరోవైపు.. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై బుధవారం (జనవరి 8) రాత్రి సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

ALSO READ | తిరుపతి తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు  సీఎం చంద్రబాబు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు.. అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని  అధికారులను ప్రశ్నించారు. 

ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా నిలదీశారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంకు జిల్లా అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీబీఎన్ ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలని సూచించారు.