![మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/six-dies-in-three-separate-accident-in-telanganas-siddipet-wanaparthy-and-khammam-districts_1CJd5ZmEBg.jpg)
- సిద్దిపేట జిల్లాలో ఇద్దరు, వనపర్తి జిల్లాలో ఇద్దరు, ఖమ్మం జిల్లాలో మరో ఇద్దరు మృత్యువాత
గజ్వేల్/జ్యోతినగర్, వెలుగు : సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో మామ, మేనల్లుడు చనిపోయారు. గజ్వేల్ సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం న్యూ పోరట్‌పల్లికి చెందిన మెరుగు లింగం (52) పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
లింగం అక్క కొడుకు, అదే గ్రామానికి చెందిన మస్కె బినేశ్ (29) ఎస్టీపీసీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు లింగం తన సోదరుడు మహేశ్, మేనల్లుడు బినేశ్, డ్రైవర్ ప్రేమ్ సాగర్‌ను తీసుకొని కారులో హైదరాబాద్ బయలుదేరాడు.
శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ శివారులోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న లింగం అక్కడికక్కడే చనిపోగా, బినేశ్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108లో గజ్వేల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బినేశ్ చనిపోగా, మహేశ్‌ను హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. లింగం కుమారుడు అభిషేక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
రెండు కంటెయినర్ల మధ్య ఇరుక్కున్న కార్లు
పెద్దమందడి, వెలుగు : ముందు వెళ్తున్న కంటెయినర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆగిన కార్లను వెనుక నుంచి మరో కంటెయినర్ ఢీకొట్టడంతో ఓ కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళతో పాటు పదేండ్ల బాబు చనిపోయాడు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజీ సమీపంలో 44వ నంబర్ హైవేపై జరిగింది. ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన చిన్నబాబు, సిద్ద (45) దంపతులు హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటున్నారు. నందికొట్కూరులో ఓ ఫంక్షన్ ఉండడంతో కూతురు, అల్లుడితో పాటు మనువడు సోఫియాన్ (10), మనుమరాలితో కలిసి శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో వెల్టూరు స్టేజీ సమీపంలోకి రాగానే ముందువెళ్తున్న ఓ కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక ఉన్న రెండు కార్లు సైతం వేగం తగ్గించాయి. ఇదే టైంలో కార్ల వెనుక వస్తున్న మరో కంటెయినర్ ముందున్న కార్లను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధ అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ సోఫియాన్ చనిపోయాడు. మిగిలిన నలుగురు హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని..
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు గ్రామ శివారులోని రైతు వేదిక వద్ద శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పువ్వాడ ఉదయ్‌నగర్‌కు చెందిన తేజావత్ వీరబాబు (28) లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతడి పిన్ని కొడుకు భుక్యా విజయ్ (33) కూలీపనులు చేస్తున్నాడు. శుక్రవారం బైక్‌పై కారేపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బూడిదెంపాడు వద్దకు రాగానే బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు.