‘ఆరడుగుల మీసాల’ బాబాయ్​!

అయ్య బాబోయ్‌‌..! ఈ మీసాలు చూశారా ఎంత పొడవున్నాయో...ఇతడి పేరు వనమాల సూరిబాబు. కానీ అంతా మీసాల బాబాయ్​ అని పిలుస్తుంటారు. రెండు వైపులా కలిపి సుమారు ఆరడుగులకు మించి మీసాలను పెంచాడు. అంటే దాదాపు మనిషి ఎత్తు.. ‌‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటకు చెందిన ఇతడు 20 ఏండ్లుగా మీసాలు పెంచుతున్నాడు. ఇప్పుడవి సుమారు ఆరడుగులకు పైగానే పెరిగాయి. తన ముత్తాత, తాత, తండ్రితో పాటు తరతరాల నుంచి మీసాలు పెంచుతూ వస్తున్నారని, తాను వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని చెప్పాడు. 

 మీసాలు పెంచడానికి ఖర్చేమీ కావడం లేదన్నాడు. కానీ, మెడిమిక్స్ ​సోప్​తో రోజూ మీసాలను శుభ్రపరుచుకుంటానని, కొబ్బరినూనె పూయడానికి, దువ్వడానికి రోజూ మూడు గంటల సమయం కేటాయిస్తానన్నాడు. తాను ఎక్కడికి వెళ్లినా మీసాల బాబాయ్ అని పిలిచి మరీ సెల్ఫీలు దిగుతారని, కొంతమంది తనను సెలబ్రిటీ లెక్క చూస్తారని గర్వంగా చెప్పాడు. తన ఊరిలో కూడా ఇంటి పేరు పెట్టి పిలవరని మీసాల సూరిబాబు అంటే తెలియని వారు లేరని, చాలామంది మీసాల బాబాయ్​ అని ప్రేమగా పిలుస్తారని చెప్పాడు.