నీళ్లలో మునిగి ఆరుగురు ఆడపిల్లలు మృతి .. పాలమూరు జిల్లాలో విషాదం

నీళ్లలో మునిగి ఆరుగురు ఆడపిల్లలు మృతి .. పాలమూరు జిల్లాలో విషాదం
  • వనపర్తి జిల్లాలో బట్టలు ఉతకడానికి వెళ్లి ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం
  • నారాయణపేట జిల్లాలో ఈతకు వెళ్లి మరో ముగ్గురు..

   శ్రీరంగాపూర్​/మరికల్​, వెలుగు : వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని తాటిపాముల  గ్రామంలో ముగ్గురు చనిపోవడం విషాదాన్ని నింపింది. ఊరికి చెందిన గంధం కురుమన్నకు తిరుపతమ్మ(16), సంధ్య(12), దీపిక(10) కూతుళ్లు. సోమవారం మధ్యాహ్నం వీరు గ్రామంలోని వీరసముద్రం చెరువులో బట్టలుతకడానికి వెళ్లారు. కొద్దికాలం కింద చెరువులో జేసీబీలతో మట్టి తీయడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇది తెలియని అక్కాచెల్లెళ్లు చెరువులో బట్టలుతుకుతుండగా ఒకరు జారి పడబోతుండగా, ఒకరిని పట్టుకోబోయి మరొకరు చెరువు గుంతల్లో పడిపోయారు. అటు నుంచి వెళ్తున్న ఓ అమ్మాయి వీరిని చూసి కేకలు వేయగా, ఓ యువకుడు దూకి ఇద్దరిని బయటకు తీసుకొచ్చాడు. కానీ, అప్పటికే వారు చనిపోయారు. మరో అమ్మాయి డెడ్​బాడీని గ్రామస్తులు గాలించి బయటకు తీసుకొచ్చారు. కురుమన్నకు ఈ ముగ్గురు బిడ్డలతో పాటు మరొక కొడుకు , కూతురు ఉన్నారు. 

గ్రామస్తుల ఆందోళనతో తరలివచ్చిన కలెక్టర్

అధికారులు నిర్లక్ష్యంతో ఫెన్సింగ్​ పెట్టకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. రాత్రి వరకు చెరువు దగ్గర నుంచి మృతదేహాలను తీయలేదు. అక్కడే టెంట్​వేసుకుని బైఠాయించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి నిరంజన్​రెడ్డి ఫోన్​ చేసి చెప్పినా వినలేదు. దీంతో రాత్రి తొమ్మిది గంటలకు కలెక్టర్ ​తేజస్ ​నందులాల్​పవార్​ గ్రామానికి రావాల్సి వచ్చింది. దళిత బంధుతో పాటు, 5 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గ్రామంలో 250 గజాల స్థలం, భవిష్యత్​లో అందులో డబుల్ బెడ్​రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్​అందిస్తామన్నారు. కేసు నమోదు చేసి డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం జిల్లా దవాఖానకు తరలించారు.

చెక్​డ్యాంలో ఈత సరదా ప్రాణాలు తీసింది 

మరికల్ : నారాయణపేట జిల్లా మరికొండ మం డలం రాకొండకు చెందిన అశోక్​, చంద్రమ్మలకు అయిదుగురు కూతుళ్లు. వీరిలో మొదటి కూతురు పెళ్లి ఈనెల 7న జరిగింది. వీరి రెండో కూతురు రాధిక (19) ఇంటర్​చదువుతోంది. వీరి బంధువుల పిల్లలైన నర్వ మండలం పాతర్​చేడ్​కు చెందిన అక్కాచెల్లెళ్లు శ్రావణి(14), మహి(12) ఆదివారం జరిగిన పెండ్లికి వచ్చారు. ఇందులో శ్రావణి పదో తరగతి చదువుతుండగా, మహి ఆరో తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు గ్రామానికి చెందిన ఓ బాలుడితో కలిసి  గ్రామ సమీపంలోని చెక్​డ్యాంకు వెళ్లారు. చెక్​డ్యాంలో ఈదుకుంటూ ముందుకు వెళ్లారు. మధ్యలోకి వెళ్లిన తర్వాత లోతుగా ఉండడంతో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న బాలుడు చూసి వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్​ చేశాడు. వారు వచ్చి చూసే సరికి ముగ్గురు మునిగిపోయారు. గ్రామస్తులు లోపలికి దిగి ముగ్గురి డెడ్​బాడీలను బయటకు తీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్​రెడ్డి తెలిపారు. 
ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​ మండలం తాటిపాములలో బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు చెరువు గుంతలో పడి చనిపోగా, నారాయణపేట జిల్లా మరికల్​మండలం రాకొండలో చెక్​డ్యాంలో ఈతకు వెళ్లిన మరో ఓ యువతి, ఇద్దరు బాలికలు విగతజీవులయ్యారు.