వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారెంటీలు: సీఎం రేవంత్​రెడ్డి

వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారెంటీలు: సీఎం రేవంత్​రెడ్డి
  • రాహుల్​ను ప్రధాని చేయాలన్నదే ఆయన చివరి కోరిక
  • కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తం
  • రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 35 మందికి  కార్పొరేషన్ పదవులు ఇచ్చాం
  • ప్రజాభవన్​లో  ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్: మాజీ సీఎం వైఎస్సార్​స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నదే వైఎస్ చివరి కోరిక అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్​విజయానికి కృషిచేసిన వారికి చైర్మన్​పదవులు ఇచ్చామని.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని స్పష్టంచేశారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని ​సిటీ సెంటర్​వద్ద ఆయన విగ్రహానికి పూలమల వేసి నివాళి అర్పించారు. 

అనంతరం ప్రజాభవన్​లో  ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.. రేవంత్​రెడ్డి. ఆ తర్వాత గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ‘ వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగపడుతోంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఆయన చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకొని అమలు చేస్తున్నారు.  వైఎస్ఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నం. రాజశేఖర్​రెడ్డి పాదయాత్ర స్ఫూర్తితోనే రాహుల్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి వంద సీటు సాధించి, మోదీ పాలనను ప్రజల్లో ఎండగట్టారు. రాహుల్ కు పదవులు ముఖ్యం కాదు. ఆయన ప్రధాని అయ్యేందుకు ఎవరు కష్టపడుతారో.. వారే అసలైన వైఎస్ వారసులు’ అని తెలిపారు. 

ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటం..

‘2021 జూలై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న. మూడేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నం. పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ 35 మంది  కాంగ్రెస్​నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. కష్టపడిన కార్యకర్తలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నదే మా ఉద్దేశం. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం’ అని సీఎం రేవంత్​స్పష్టం చేశారు.

వారంతా కాంగ్రెస్‌లోకి రండి:  భట్టి

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. రాబోయే రెండు దశాబ్దాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు. మాపై నమ్మకంతో భారీ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలఎత్తుకొని తిరిగేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాత నాయకులందరూ పార్టీలోకి రావాలని వారంతా హస్తం పార్టీలోకి రావాలని భట్టి పిలుపునిచ్చారు.