- బీజాపూర్ జిల్లాలోని తాలిపేరు నది ఒడ్డున కాల్పులు
- విప్లవ సాహిత్యం, మందుపాతరలు, తుపాకులు స్వాధీనం
- కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయినట్లు పోలీసుల వెల్లడి
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. హోలీ పండుగ రోజు బీజాపూర్ జిల్లా బాసగూడలోని పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన బీజాపూర్ పోలీసులు.. ప్లాటూన్ నంబర్ 10 మావోయిస్టు దళం ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నారు.
బుధవారం బాసగూడలో తాలిపేరు నది ఒడ్డున ఉన్న చీపురభట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో బస్తర్ ఐటీ సుందర్ కుమార్, బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ సీఆర్‌పీఎఫ్ 210, 205 బలగాలతో పాటు 229 కోబ్రా పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డు (డీఆర్జీ) పోలీసుల బృందం అక్కడికి వెళ్లింది. వీరి రాకను గమనించిన మావోయిస్టులు.. బలగాలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి.
ఈ క్రమంలో ప్లాటూన్ నంబర్ 10 దళాన్ని చుట్టుముట్టి, కాల్పులు జరపగా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో కొంత మంది మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. మృతులను ప్లాటూన్ నంబర్ 10 డిప్యూటీ దళ కమాండర్ నగేశ్, అతని భార్య సోనితో పాటు ఏరియా కమిటీ మెంబర్ గంగీ, మిలీషియా కమాండర్ సుక్కా, మిలీషియా సెకండ్ కమాండర్ ముక్కా, డివిజన్ మిలీషియా చీఫ్ వికాస్‌గా గుర్తించారు.
అలాగే, ఘటన స్థలంలో విప్లవ సాహిత్యం, మందుపాతరలు, తుపాకులు, డిటోనేటర్లు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు మావోయిస్టులు వ్యూహ రచన చేస్తున్నారని బస్తర్ ఐజీ సుందర్ కుమార్ తెలిపారు. వారి దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టేందుకు టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) నిర్వహిస్తున్నట్లు వివరించారు.