
- రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్ సర్కార్
అమరావతి: ఏపీలోని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును, ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట ఏరియాలోని మలుపు వద్ద హైవేపై ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.
ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పుల్లంపేట ప్రమాదంలో ఆరుగురు చనిపోవడం బాధాకరమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి ఫ్యామిలీలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇస్తామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.