- మృతులంతా ఒకే కుటుంబం
- సినీ ఫక్కీలో మర్డర్లు
- కామారెడ్డి జిల్లాలో ఘటన
కామారెడ్డి జిల్లాలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివనగర్ పోలీసుల కథనం ప్రకారం.. మాక్లూర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. మాక్లూరులో ఉన్న ప్రసాద్ ఇంటిపై అతని స్నేహితుడు ప్రశాంత్ కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇంటిని అతని పేరిట రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు.
ముందస్తు ప్లాన్
ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్.. పథకం ప్రకారం ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్లి నిజామాబాద్– కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను కూడా చంపేసి బాసర నదిలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని మర్డర్ చేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో.. ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం.
నిందితుడు ప్రశాంత్ మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు మర్డర్లలో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.