హైదరాబాద్​​లో ఆరు మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్​లు

హైదరాబాద్​​లో ఆరు మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్​లు
  • ఆహార కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం
  •  జీహెచ్ఎంసీ సీనియర్ ఆఫీసర్లకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార కల్తీకి చెక్ పెట్టేందుకు 6 మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్​లను ఏర్పాటు చేయనున్నట్లు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మాల్కాజ్ గిరి జిల్లాల్లోనే 60 శాతం ఫుడ్ జిబినెస్ లు కొనసాగుతున్నాయన్నారు. 

గ్రేటర్ హైదరాబాద్​లోని కోర్ ప్రాంతాల్లో జోన్ కు ఒక మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుందని వెల్లడించారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు క్రిస్టినా చోంగ్తూ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీపై సెక్రటేరియెట్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘హోటళ్లు, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను త్వరలోనే నియమిస్తాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను జీహెచ్ఎంసీలోని సీనియర్ అధికారులకు అప్పగిస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ విషయంలో హోటల్, రెస్టారెంట్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. 

ఫుడ్ విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ను పెంపొందించేందుకు కృషి చేయాలి. నిర్వాహకులందరూ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్​లు కలిగి ఉండాలి. దీనిపై అధికారులు అవగాహన కల్పించాలి’’అని క్రిస్టినా చెప్పారు. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను ఆధునీకరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ గతంలో తెలిపారు. 

నాచారంతో పాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా కొత్తగా 3 టెస్టింగ్ ల్యాబ్​లు ఏర్పాటు చేయనున్నారు. ఇవే గాకుండా 10 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లు, ఏడాదికి కనీసం 24 వేల శాంపిల్స్ ను టెస్టు చేసేలా త్వరలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని పటిష్టం చేయనున్నారు. ఈ రివ్యూ మీటింగ్​లో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్​వీ కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఐపీఎం డైరెక్టర్ శివలీల, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజా, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.