బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్..​ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్​లోకి సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో చేరిక

బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్..​ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్​లోకి సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో చేరిక

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్​లో చేరారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్​రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్​ మున్షీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు. ఇందులో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, దండే విఠల్​, ఎగ్గే మల్లేశం, ప్రభాకర్ రావు, బుగ్గారపు దయానంద్ ఉన్నారు. రెండురోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్​రెడ్డి గురువారం అర్ధరాత్రి హైదరాబాద్​కు చేరుకోగానే.. ఆరుగురు ఎమ్మెల్సీలు ఆయనను కలిసి కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్​రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు.. 

బీఆర్​ఎస్​ పార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. 

బుధవారం బీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కేకే కూడా కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఆ మరుసటిరోజే గురువారం రాత్రి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పారు. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. రెండు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్​కు నలుగురు సభ్యులు ఉండగా.. ఇప్పుడు బీఆర్​ఎస్​ నుంచి ఆరుగురు చేరడంతో ఆ పార్టీ బలం 10కి చేరింది.

చేరిన ఎమ్మెల్సీలు వీళ్లే

1. బస్వరాజు సారయ్య
2. దండే విఠల్​
3. భాను ప్రసాద్​ రావు
4. బుగ్గారపు దయానంద్​
5. ప్రభాకర్​ రావు
6. ఎగ్గే మల్లేశం