
- అక్రమ ఆయుధాల చట్టం కింద జైలులో వేసిన ఆ దేశ ప్రభుత్వం
- ప్రభుత్వం స్పందించి విడుదల చేయించాలని కోరుతున్న
- బాధిత కుటుంబాలు
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తూరాబాద్, మున్యాల గ్రామాలకు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి జైల్లో చిక్కుకున్నారు. వీరంతా అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద అరెస్టవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురజాల శంకర్, గురజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మున్యాల గ్రామానికి చెందిన యమనూరి రవీందర్ లను జాబ్ వీసా పేరిట ఏజెంట్ నమ్మించి విసిట్ వీసా మీద మలేషియాకు పంపించాడు. అక్కడ వీరికి ఎలాంటి పని దొరకకపోవడంతో తిండి కోసం తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఎలాగోలాగా ఓ కంపెనీలో తాత్కాలికంగా పనికి కుదిరారు.
అక్కడ అక్రమ ఆయుధాల కేసులో గతేడాది అక్టోబర్ 28న ఇరుక్కున్నారు. వీరిని మలేషియా ప్రభుత్వం అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపింది. సమాచారం కుటుంబ సభ్యులు ఆలస్యంగా తెలియడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏజెంట్ నమ్మించి ఆరుగురి నుంచి రూ. లక్షలు తీసుకుని తీసుకెళ్లి మోసగించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి తమ కుటుంబసభ్యులను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ చార్జి జాన్సన్ నాయక్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మలేషియా వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించి విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.