టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్, ముమ్మిడివరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ బంధువులు ఆరుగురు ప్రాణాలు కోల్పాయారు. మృతి చెందిన వారిలో సతీశ్ బాబాయి పొన్నాడ నాగేశ్వరరావు (68), చిన్నమ్మ సీతా మహాలక్ష్మి (65), కుమార్తె నవీన (38), మనవడు కృతిక్ (11), మనవరాలు నిషిధ (9) మరో బంధువు ఉన్నారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఎమ్మెల్యే సతీశ్ చిన్నాన్న కూమర్తె నవీన గంగ, అల్లుడు లోకేశ్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి టెక్సాస్‌లో ఉంటున్నారు.
అమలాపురంలో నివసిస్తున్న నాగేశ్వరరావు దంపతులు రెండు నెలల క్రితం కూతురు ఇంటికి వెళ్లారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా మంగళవారం ఏడుగురు కుటుంబసభ్యులు కారులో బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ వేడుకలు ముగిశాక తిరిగి ఇంటికి బయలుదేరారు. జాన్సన్ కౌంటీలోని హైవేపై వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. దాంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. లోకేశ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
కానీ ఆయన పరిస్థితి కూడా ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఇద్దరు యువకులతో వెళ్తున్న ట్రక్కు .. రాంగ్ రూట్‌లో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే సతీశ్ తెలిపారు. ట్రక్కు తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడంతో అమలాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.