టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కనీసం సూపర్ 8 కు చేరుకోలేకపోయింది. 2022 వరల్డ్ కప్ రన్నరప్ గా ఈ టోర్నీలో ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్థాన్ కు అమెరికా గడ్డపై చేదు జ్ఞాపకాలే మిగిలాయి. నాలుగు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి మరో రెండో మ్యాచ్ ల్లో ఓడిపోయి గ్రూప్ ఏ లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్, అమెరికా జట్లు ఈ గ్రూప్ లో సూపర్ 8 కు చేరుకున్నాయి. దీంతో బాబర్ సేనపై ఫ్యాన్స్ నుంచి మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే వీటన్నితో మాకు సంబంధం లేనట్టు పాక్ ఆటగాళ్లు హాలిడే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కెప్టెన్ బాబర్ అజామ్ తో సహా మరో ఐదుగురు పాకిస్తానీ ఆటగాళ్లు హాలిడే ట్రిప్ కు లండన్ వెళ్లనున్నారని నివేదికలు చెబుతున్నాయి. కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్, హరీస్ రవూఫ్, ఆజం ఖాన్ జట్టుతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. ఈ ఆరుగురు లండన్‌లో తమ కుటుంబం, స్నేహితులతో సమయం గడపాలని నిర్ణయించుకున్నారట. మరికొందరు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్థానిక లీగ్‌లలో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆరుగురు తప్ప మిగిలిన స్క్వాడ్ అంతా పాకిస్థాన్ కు వెళ్తారు.పాకిస్తాన్ జట్టు ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్, అసిస్టెంట్ కోచ్ అజర్ మహమూద్ తమ స్వస్థలాలకు బయలుదేరుతారని నివేదిక సూచిస్తుంది.
వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు సారథి బాబర్ ఆజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మసూద్ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్(3 టెస్టులు) అవ్వగా.. ఆఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది. దీంతో వీరిని తప్పించి ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మళ్లీ బాబర్ ఆజంకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. పాక్ జట్టులో ఎన్ని మార్పలు చేసినా ఫలితం మాత్రం మారలేదు.