కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. దాని బారినపడి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 37,780 మంది మరణించగా.. దాదాపు 7 లక్షల 84వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. కాగా.. ఇప్పటివరకు 1 లక్షా 65 వేలమంది కోలుకున్నారు. ఇక భారత్ విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా 43 మంది మరణించగా..1347 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి.
ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ తెలంగాణలో మొత్తంగా ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు తెలంగాణ సీఎమ్ఓ అధికారికంగా ప్రకటించింది.
మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి సూచిస్తుంది. వారందరికీ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స కూడా అందించాలని నిర్ణయించింది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరుతున్నది.