వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. హైదరాబాద్-విజయవాడ హైవేపై తండ్రి, కొడుకు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి..  హైదరాబాద్-విజయవాడ హైవేపై తండ్రి, కొడుకు మృతి

చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. హైదరాబాద్–విజయవాడ హైవేపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు చనిపోయారు. చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  పటాన్ చెరుకు చెందిన సాయికుమార్(33) తన భార్య, తల్లి తండ్రులు కొడుకు వీరాన్ష్(5 నెలలు)తో కలిసి కారులో తన అత్తగారిల్లు అయిన సూర్యాపేటకు బయలుదేరాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్  మండలం దండు మల్కాపురం దాటగానే హైదరాబాద్  వైపు వెళ్తున్న మరో కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టి, ఆ తరువాత వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ముందు సీట్​లో కూర్చున్న సాయికుమార్, కొడుకు వీరాన్ష్​​అక్కడికక్కడే చనిపోయారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో కొడుకు, మనవడు చనిపోవడంతో వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.

నల్గొండలో ఐచర్​​డ్రైవర్, క్లీనర్..

నల్గొండ అర్బన్: లారీ డ్రైవర్  సడెన్  బ్రేక్  వేయడంతో వెనక వస్తున్న ఐచర్ వెనక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్, క్లీనర్​ చనిపోయారు. టూ టౌన్  సీఐ రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం.. ముందు వెళ్తున్న లారీ సడెన్  బ్రేక్  వేయడంతో పానగల్  ఫ్లై ఓవర్  ఎక్కుతున్న ఐచర్​ వెహికల్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐచర్​ డ్రైవర్  ఉమేశ్ కుమార్(37), క్లీనర్  రాజీవ్(36) అక్కడికక్కడే చనిపోయారు. మృతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. 

కారు, బైక్ ఢీకొని ఇద్దరు..

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్  జిల్లాలో కారును బైక్​ ఢీకొనడంతో దగ్గరి బంధువులు ఇద్దరు చనిపోయారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. హైదరాబాద్​ పెట్రోల్  బంక్​లో పని చేస్తున్న శ్రీను(38), శేఖర్​(36) సొంత గ్రామమైన తెలకపల్లి మండలం అనంతసాగర్  గ్రామానికి వచ్చి, బుధవారం బైక్​పై హైదరాబాద్​ బయలుదేరారు.తాడూరు మండలం గుంత కోడూర్  గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్  టేక్  చేస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడ్డారు. వారిని నాగర్ కర్నూల్  జనరల్  ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.