ఐదు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ఐదు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
  • సిరిసిల్ల జిల్లాలో బైక్‌‌, కారు ఢీ.. ఇద్దరు మృతి
  • సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో ఒకొక్కరు..

ఎల్లారెడ్డిపేట/మునగాల/సంగారెడ్డి (హత్నూర)/శివ్వంపేట/బోథ్‌‌, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. ఇందులో సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో  ఒక్కొక్కరు చనిపోయారు.

సినిమా చూసేందుకు వెళ్తూ...

సినిమా చూడటానికి బైక్‌‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఓ స్టూడెంట్‌‌తో పాటు మరో యువకుడు చనిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ఒంగోలు జిల్లాకు చెందిన తన్నీరు శివ, ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల మధు (29) కొన్నేండ్ల కింద ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి వచ్చి భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. తన్నీరు శివకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు మహేశ్‌‌ బాబు (18) హైదరాబాద్‌‌లో ఇంటర్‌‌ చదువుతున్నాడు. 

సెలవులు కావడంతో ప్రస్తుతం ఎల్లారెడ్డిపేటకు వచ్చాడు. మధు, మహేశ్‌‌బాబు కలిసి సినిమా చూసేందుకు ఆదివారం బైక్‌‌పై సిరిసిల్ల వెళ్తున్నారు. ఈ క్రమంలో పదిర గ్రామ శివారు వద్దకు చేరుకోగానే కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మధు, మహేశ్‌‌బాబుకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో హాస్పిటల్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

లారీని ఢీకొట్టిన కారు, మహిళ మృతి

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో 65వ నంబర్‌‌ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మండలం కొత్త గుడిబండ గ్రామానికి చెందిన పోనగండ్ల జ్యోతి (48) కోదాడలోని శివ సాయి నగర్‌‌లో ఉంటోంది. వారం రోజుల కింద హైదరాబాద్‌‌లోని తన అక్క వద్దకు వెళ్లింది. శనివారం రాత్రి తన అల్లుడు, ఏపీలోని ఏలూరు జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ ఉద్యోగి గాదె నరేందర్‌‌రెడ్డితో కలిసి కారులో హైదరాబాద్‌‌ నుంచి కోదాడకు వస్తోంది. 

ఈ క్రమంలో మునగాల మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌‌ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే చనిపోగా, నరేందర్‌‌రెడ్డికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్‌‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వ్యక్తిని కోదాడకు తరలించారు. మృతురాలి భర్త రాంరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ధారా వెంకటరత్నం తెలిపారు. 

కారు, బస్సు ఢీ.. యువకుడు...

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన శ్రవణ్‌‌కుమార్‌‌ (19) ఆదివారం కారులో తూప్రాన్‌‌ వైపు నుంచి నల్లవల్లికి వస్తున్నాడు. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌‌పల్లి శివారులోకి రాగానే గజ్వేల్​వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రవణ్‌‌ను తూప్రాన్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

బైక్‌‌, టాటా ఏస్‌‌ ఢీకొని...

ధన్నూర్‌‌ ‘బి’ గ్రామానికి చెందిన ముసుగు రాకేశ్‌‌రెడ్డి (37), ముద్దం రాజు బైక్‌‌పై బోథ్‌‌ నుంచి ధన్నూర్‌‌ వెళ్తున్నారు. బోథ్‌‌ సమీపంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలోకి రాగానే ఆదిలాబాద్‌‌ వైపు నుంచి వస్తున్న టాటా ఏస్‌‌ ఢీకొట్టింది. గాయపడ్డ ఇద్దరిని హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాకేశ్‌‌రెడ్డి చనిపోయాడు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంగారెడ్డి జిల్లాలో  బైక్‌‌ను ఢీకొట్టిన కారు

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి శివారులో ఆదివారం బైక్‌‌ను కారు ఢీకొట్టడంతో మహిళ చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మెదక్‌‌ జిల్లా చిలప్‌‌చేడ్‌‌ మండలం అజ్జమారి గ్రామానికి చెందిన కృపాకర్‌‌ తన భార్య అనూష, కూతురితో పాటు తల్లి అమృత (45)తో కలిసి బైక్‌‌పై దౌల్తాబాద్‌‌ వెళ్తున్నాడు. హత్నూర మండలం దేవులపల్లి శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అమృత అక్కడికక్కడే చనిపోగా, ఆమె కొడుకు, కోడలు, మనవరాలికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని సంగారెడ్డి హాస్పిటల్‌‌కు తరలించారు.