వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి

వడదెబ్బతో తెలంగాణలో  ఆరుగురు మృతి

రాష్ట్రంలో  పెరుగుతున్న ఎండ తీవ్రత, వడదెబ్బతో శనివారం ఆరుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం బల్​నాయక్​తండాకు చెందిన లకావత్​ రామన్న(45) యాటకార్లపల్లెలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో  టీచర్​గా పనిచేస్తున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ ట్రైనింగ్​కోసం శుక్రవారం మధ్యాహ్నం బస్సులో హుస్నాబాద్​ నుంచి గజ్వేల్​వెళ్లాడు. బస్సు దిగి లంచ్​ చేసిన తర్వాత అస్వస్థతకు గురై పడిపోయాడు.  వరంగల్​ఎంజీఎంలో ట్రీట్​మెంట్​ పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు. నాగర్​కర్నూల్​జిల్లా  పెంట్లవెళ్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు(55)  ట్రాక్టర్  డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం వడదెబ్బ తగిలి కింద పడిపోగా, కుటుంబ సభ్యులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజును పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతను చనిపోయినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

కరీంనగర్‌‌ జిల్లా చొప్పదండికి చెందిన భూమయ్య ఎంఈఓగా, జగిత్యాల జిల్లా ఎండపల్లి జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎంగా పని చేస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో భాగంగా ధర్మపురి, వెల్గటూరు, బుగ్గారం, ఎండపల్లి మండలాల్లో  శుక్రవారం డ్యూటీ చేశాడు. డ్యూటీ నుంచి ఇంటికి రాగానే అస్వస్థతకు గురయ్యాడు.శనివారం తెల్లవారుజామున విరోచనాలు, వాంతులతో కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించేలోపే భూమయ్య చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ లోనూ ఓ వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. ఆవుల కనకయ్య(60) ఇటీవల బంధువు చనిపోవడంతో వెళ్లి వచ్చాడు. 

అప్పటి నుంచి అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేలా గోండుగూడెం గ్రామానికి చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం పొలానికి వెళ్లి వచ్చాడు. నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. భార్య తాగునీరు ఇచ్చేందుకు నిద్ర నిద్రలేపడానికి ప్రయత్నించగా అప్పటికే సోము చనిపోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తాళ్లూరి దుర్గయ్య (45)  రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. శనివారం మృతి చెందాడు. దుర్గయ్య 20 ఏండ్లుగా దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.