సత్తుపల్లి, వెలుగు : గుడులే టార్గెట్‌గా చోరీలు చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా వేంసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ అనిశెట్టి రఘు బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై తిరుగుతూ స్థానికులకు కనిపించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వేంసూర్ ఎస్సై వీరప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆలయం వద్దకు రాగానే వారిని చూసిన ఆరుగురు పారిపోయేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని పట్టుకొని వారి నుంచి కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్, ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా ఆలయాల్లో చోరీల విషయం బయటపడింది. నిందితుల్లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వెల్లబోయిన గోపి, అద్దంకి గురవయ్య, అద్దంకి శివ, ముంగి రాము, ముంగి కృష్ణతో మరో మైనర్ ఉన్నాడు. వీరంతా చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం మధిర, బోనకల్ వత్సవాయి పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో గంటలు, హుండీలను చోరీ చేసేవారు.
ఆగస్ట్ 20న అచ్చంపేట ఏరియాలోని సత్తెమ్మ తల్లి గుడిలో, 28న వేంసూరు మండలం వెంకటాపురంలోని అంకమ్మతల్లి గుడిలో చోరీలు చేశారు. చోరీ చేసిన వెండి వస్తువుల విలువ 3.3 కిలోలు ఉండగా, హుండీల్లో రూ. 1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వీటన్నింటిన పెనుగంచిప్రోలులోని గోపి ఇంట్లో దాచిపెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న వేంసూర్ ఎస్సై వీరప్రసాద్, ఎస్సై వెంకటేశ్, సిబ్బందిని సీపీ సునీల్ దత్ అభినందించి రివార్డు ప్రకటించినట్లు ఏసీపీ చెప్పారు. ఏసీపీ వెంట రూరల్ సీఐ ముత్తుస్వామి ఉన్నారు.