అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం

  • అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం 
  • మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో దారుణం
  • మంటల్లో కాలిపోయి ముద్దలైన డెడ్ బాడీలు
  • చనిపోయినోళ్లలో ఇద్దరు చిన్నారులు.. స్పాట్​కు దగ్గర్లో దొరికిన పెట్రోల్ క్యాన్లు
  • వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని అనుమానాలు 

మందమర్రి, వెలుగు:  మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లో పడుకున్నోళ్లు పడుకున్న చోటనే ముద్దలయ్యారు. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా డెడ్ బాడీలు కాలిపోయాయి. చనిపోయినోళ్లలో ఒకే కుటుంబానికి చెందినోళ్లు ఐదుగురు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటన మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మాసు శివయ్య(55), రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ (45) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు కాగా.. అందరికీ లగ్గాలు అయ్యాయి. ఇటీవల పెద్ద బిడ్డ చనిపోయింది. కొడుకు వేరే చోట కుటుంబంతో ఉంటున్నాడు. కొన్నేండ్ల కింద శివయ్య, రాజ్యలక్ష్మి సింగరేణి బంగ్లాస్ ఏరియాలో సర్వెంట్లుగా పని చేశారు. అప్పుడు సింగరేణిలో మైనింగ్ సర్దార్ గా పని చేస్తున్న శనిగారపు శాంతయ్య (57)తో వీళ్లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి రాజ్యలక్ష్మి కుటుంబంతోనే శాంతయ్య ఉంటున్నాడు. దాదాపు పదేండ్లుగా శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఇటీవల రాజ్యలక్ష్మికి యాక్సిడెంట్ కావడంతో ఆమెను చూసుకోవడం కోసమని ఆమె అక్క బిడ్డ గడ్డం మౌనిక (25)ను శివయ్య ఈ నెల 11న ఇంటికి తీసుకొచ్చాడు.  మౌనికకు ఇద్దరు బిడ్డలు ప్రశాంతి (4), హిమబిందు (1) ఉన్నారు. శుక్రవారం రాత్రి అందరూ ఇంట్లో నిద్రించగా, అర్ధరాత్రి మంటల్లో ఆరుగురూ సజీవ దహనమయ్యారు. 

కాలిపోయి కూలిన పైకప్పు.. 

శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో శివయ్య ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇంట్లో నుంచి ఎలాంటి కేకలు వినపడకపోవడంతో చుట్టుపక్కలోళ్లు చాలాసేపు గుర్తించలేదు. కొంతసేపటికి మంటలు ఎక్కువ కావడంతో గుర్తించి బయటకు వచ్చారు. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రామకృష్ణాపూర్ పోలీసులు, మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే ఇల్లంతా కాలిపోయి పైకప్పు కుప్పకూలింది. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. శిథిలాల కింది నుంచి ఆరు డెడ్ బాడీలను బయటకు తీశారు. స్థానికుల సాయంతో వాళ్లను శివయ్య, అతని కుటుంబసభ్యులు, శాంతయ్యగా గుర్తించారు. ఇంటి దగ్గరే పోస్టుమార్టం చేశారు. శివయ్య, అతని కుటుంబసభ్యుల అంత్యక్రియలు నిర్వహించారు. శాంతయ్య డెడ్ బాడీని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో మంచిర్యాల జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కాగా, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీలు తిరుపతి రెడ్డి, నరేందర్, మందమర్రి సీఐ ప్రమోద్ రావు, నలుగురు సీఐలు, 8 మంది ఎస్సైలు సహా వంద మందికి పైగా సిబ్బంది వచ్చారు. 

ముందే చంపేశారా? మత్తు మందు పెట్టారా?  

షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు. కానీ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని కరెంట్ అధికారులు తేల్చారు. పైగా ఇంటికి మంటలు అంటుకుంటే బాధితులు కనీసం కేకలు కూడా వేయలేదు. తప్పించుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. పడుకున్నోళ్లు పడుకున్న చోటే చనిపోయారు. ఆ ఇంటికి సమీపంలో 20 లీటర్ల చొప్పున ఉన్న రెండు పెట్రోల్ క్యాన్లు దొరికాయి. వాటిల్లో ఇంకా 10 లీటర్ల పెట్రోల్ మిగిలి ఉంది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్క్వాడ్ ను తీసుకురాగా.. జైపూర్ మండలంలోని కాన్కూర్ వైపు వెళ్లాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురిని చంపేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి అరుపులు వినిపించ లేదంటే ఆహారంలో ఏదైనా విషం పెట్టారా? లేదంటే మత్తు మందు ఇచ్చారా? అని అనుమానిస్తున్నారు. 

శాంతయ్య కుటుంబసభ్యుల పనేనా?  

శాంతయ్యకు భార్య సృజన, కొడుకులు రాజ్ కుమార్, దీపక్ కుమార్, బిడ్డ మౌనిక ఉన్నారు. శాంతయ్య తన కుటుంబాన్ని వదిలేసి రాజ్యలక్ష్మి కుటుంబంతోనే ఉంటున్నాడు. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తమ దగ్గరికి రావాలని కుటుంబసభ్యులు కొన్నాళ్లుగా శాంతయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయనకు వస్తున్న జీతంతో పాటు ఆస్తులను రాజ్యలక్ష్మికి ఇచ్చేస్తున్నాడని కోపం పెంచుకున్నారు. శాంతయ్య రిటైర్​మెంట్ దగ్గర పడుతుండడంతో కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని భార్య సృజన పట్టుబడుతోంది. అయితే తనకూ హక్కు ఉంటుందని, డబ్బులు ఇవ్వాలని రాజ్యలక్ష్మి పట్టుబడుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడంతో పాటు వారసత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకుంటోందన్న కోపంతో శాంతయ్య కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శాంతయ్య చనిపోయాడని తెలిసినా ఎవరూ రాకపోవడం, ఆయన డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు కూడా రాకపోవడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యలక్ష్మి, శాంతయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని.. అదే దీనంతటికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. 

చుట్టంగా వచ్చి...


రాజ్యలక్ష్మి ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన తన అక్క కూతురు మౌనిక, ఆమె బిడ్డలు ఇద్దరూ చనిపోయారు. మౌనికకు లక్షెట్టిపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన కిషన్ తో లగ్గమైంది. ఏడాది కిందట అనారోగ్యంతో కిషన్ చనిపోవడంతో కోటపల్లి మండలం కొండంపేటలోని సోదరుడు ప్రశాంత్ ఇంట్లో మౌనిక ఉంటోంది. అయితే రాజ్యలక్ష్మి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆమె బాగోగులు చూసుకునేందుకు మౌనిక వచ్చింది.

నిందితులను  త్వరలోనే పట్టుకుంటం..

ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా కావాలని చేశారా? అనే దానిపై విచారణ జరుపుతున్నాం. శాంతయ్య కుటుంబసభ్యుల ప్రమేయంపై ఆరా తీస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటం. ఇందుకోసం 16 టీంలను ఏర్పాటు చేశాం. 

- అఖిల్ మహాజన్, మంచిర్యాల డీసీపీ