పులి చర్మం అమ్మబోతూ పోలీసులకు చిక్కిన ఆరుగురు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఓ చిరుత పులిని చంపారు. పులి చర్మం ఒలిచి, మహారాష్ట్రలో అమ్మడానికి వెళ్తూ.. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్​లో పోలీసులకు చిక్కారు. జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా హుసూరు తాలూకా పామేడ్ ప్రాంతానికి చెందిన ఇరుప నాగేంద్రబాబు, పోలం వెంకటేశ్.. పులి చర్మంతో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశించి, పామేరు శివారులో ఉచ్చు పెట్టి, పులిని చంపారు.

చర్మాన్ని ఒలిచి, దానిని అమ్మేందుకు మరో నలుగురు వ్యక్తులు పరిసబోయిన రాజేశ్, ఎర్రగట్ల శ్రీకాంత్, బుర్రి సాయికిరణ్, కిషోర్ లతో కలిసి మహారాష్ట్రకు బయలుదేరారు. బుధవారం మహాదేవపూర్ లో ఆగి, ఇదే విషయంపై చర్చించుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో మహాదేవపూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు పారిపోతుండగా వారిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుల వద్ద పులి చర్మం, రెండు బైక్ లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను చంపినా, హాని కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సురేందర్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాంమోహన్ రెడ్డి, సీఐ కిరణ్, మహదేవ్ పూర్ ఎస్సై ఎన్. రాజకుమార్ తదితరులున్నారు.