ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. బిల్లు కట్టలేదని, గిప్ట్ వచ్చిందని..ఏవోవో చెప్పి..వారికి తెలియకుండానే బ్యాంకుల నుంచి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా.. కరెంటు బిల్లు కట్టలేదు.. వెంటనే కట్టేయాలి లేకపోతే కట్ చేస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఫోన్ లు చేస్తున్నారు. దీంతో వారి మాటలు నమ్మి.. నిలువునా మోసపోతున్నారు. కరెంటు కట్ కాకుండా ఉండాలంటే.. వెంటనే బిల్లు కట్టేయండి.. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.. మీ అకౌంట్ వివరాలు ఇవ్వండి.. లేదా.. మీకు ఒక లింక్ పంపిస్తాం.. అందులో కట్టేయండి అంటూ విద్యుత్ సిబ్బందిగా పరిచయం చేసుకున్న వ్యక్తులు చెబుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా.. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు వారంలోగా చెల్లించాలని లేకపోతే కట్ అవుతుందంటూ ఆరుగురిని మోసం చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారుల వివరాల ప్రకారం... బిల్లు గడువు మించిపోయిందంటూ తన ఫోన్ కాల్ కు ఓ మెసేజ్ వచ్చినట్లు ఫిర్యాదుదారుడు అనంత్ తెలిపారు. బిల్లు చెల్లించడంలో విఫలమైతే విద్యుత్ కనెక్షన్ ను డిస్ కనెక్ట్ చేస్తామని మెసేజ్ లో ఉందన్నారు. మెసేజ్ పంపిన వ్యక్తికి తాను ఫోన్ చేసినట్లు.. తాను విద్యుత్ పంపిణీ అధికారిగా పరిచయం చేసుకున్నాడన్నారు.
ఏదో అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోమని చెప్పాడని, అలాగే చేయడం జరిగిందన్నారు. పెనాల్టీ నుంచి తప్పించుకొనేందుకు రూ. 50 చెల్లించాలని అతను చెప్పడంతో అలాగే చేసినట్లు అనంత్ తెలిపారు. అనంతరం తన బ్యాంకు ఖాతా నుంచి రెండు దఫాలుగా లక్ష రూపాయలు అపహరించారని ఫిర్యాదులో తెలిపారు. ఇలా ఆరుగురు వ్యక్తులను మోసం చేశారని అధికారి తెలిపారు. మొత్తం రూ. 3.82 లక్షలను రికవరీ చేసి వారి బ్యాంకు ఖాతాలకు గంటల వ్యవధిలో పంపించినట్లు వెల్లడించారు.