మిర్యాలగూడ, వెలుగు : మరో మూడు నిమిషాల్లో ఇల్లు చేరుకోవాల్సిన రెండు కుటుంబాలను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. ఇంటికి కేవలం 300 మీటర్ల దూరంలోని స్టేట్ హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చనిపోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని కృష్ణ మానస కాలనీ వద్ద అద్దంకి~ నార్కెట్ పల్లి హైవేపై జరిగిన ప్రమాదంలో సమీప బంధువులైన రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న మాధవి అనే యువతి సోమవారం ఉదయం చనిపోయారు.
మిర్యాలగూడలోని నందిపాడుకు చెందిన చెరుపల్లి మహేశ్(32), అతని భార్య జ్యోతి(30) కూతురు రిషిత(6), మహేశ్ తోడల్లుడు వలిగొండ మండలం గోల్నే పల్లికి చెందిన భూమ మశ్చేంద్ర(29), అతని భార్య మాధవి (24), కూతురు లియాన్షి(2) మరో రెండు ఫ్యామిలీలతో కలిసి ఏపీలోని పెనుగంచిప్రోలు, కోటప్పకొండ, విజయవాడ, మోపిదేవి టెంపుల్, మచిలీపట్నంలో దైవ దర్శనం చేసుకునేందుకు ఈనెల 26న రెండు కార్లలో వెళ్లారు. ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుని ఆదివారం నందిపాడుకు తిరుగు ప్రయాణమయ్యారు. మరో మూడు నిమిషాల్లో ఇల్లు చేరుతారనగా.. ఇంటికి 300 మీటర్ల దూరంలో హైవేపై ప్రమాదం జరిగింది.
కృష్ణ మానస కాలనీ దగ్గర వారి ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేసింది. లారీని తప్పించే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ మీదుగా మరోవైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న పొట్టు లారీ కారును ఢీకొట్టగా కారులో ఉన్న మహేశ్, మచ్చేంద్ర కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. ప్రమాదం జరిగిన చోటే మహేశ్, జ్యోతి, రిషిత , రియాన్సీ, మచ్చేంద్ర చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మాధవి చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. దైవదర్శనం చేసుకుని రెండు కుటుంబాలు ఇంటి చేరుకోవడానికి 3 నిమిషాల ముందే మృతువాత పడటం విషాదం నింపింది. పొట్టు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.