సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్.. 100 రోజుల పాటు 120 రైళ్ల దారి మళ్లింపు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్.. 100 రోజుల పాటు 120 రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కొన్ని ప్లాట్‌ఫామ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లను క్లోజ్‌ చేశారు. సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. 100 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్‌లను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు పూర్తి చేసేందుకు 120 రైళ్లను దారి మళ్లించారు.

సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌ను రూ.720 కోట్లతో రైల్వే శాఖ ఆధునీకరిస్తున్నది. రైల్వే స్టేషన్‌‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులకు రద్దీకి ఇబ్బందుల్లేకుండా స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ మాదిరిగా రూపుదిద్దనున్నట్టు అధికారులు తెలిపారు.

స్టేషన్‌‌ లోపల షాపులు, ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ కౌంటర్లు నిర్మిస్తున్నారు. స్టేషన్‌‌ను జీ+3 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌‌‌‌గా దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్‌‌కు రెండు వైపులా రెండు ట్రావెలర్లతో పాటు రెండు నడక మార్గాలను నిర్మిస్తున్నారు. లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

స్టేషన్‌‌కు ఈస్ట్ వైపు ఒకస్కైవేను మెట్రో స్టేషన్‌‌తో అనుసంధానం చేస్తున్నారు. 5కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. అడ్వాన్స్‌‌డ్‌‌ సెక్యూరిటీ సిస్టమ్‌‌తో పాటు మొత్తం స్టేషన్‌‌ కవర్ చేస్తూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎల్ఈడీ లైటింగ్, ఈవీ ఛార్జింగ్‌‌ కేంద్రాలు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భవనం చరిత్రలో కలిసిపోయింది. నిజాం హయాంలో హైదరాబాద్ స్టేట్ రైల్వేస్ పేరుతో ఒక వెలుగు వెలిగిన ఈ స్టేషన్​భవనాన్ని ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఈ స్టేషన్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ 11,500 చ.మీ. విస్తీర్ణంలో ఉండగా, దానిని 37,500 చ. మీ. విస్తీర్ణంలో విస్తరించేందుకు ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి.