![ఖమ్మం జిల్లాలో ఆటో బోల్తా..ఆరుగురు విద్యార్థులకు గాయాలు](https://static.v6velugu.com/uploads/2025/02/six-students-injured-after-auto-overturns-in-khammam-district-karepalli-mandal_QTr8mYg1nU.jpg)
- తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఖమ్మం ఆసుపత్రికి తరలింపు
కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు సమీపంలో సోమవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మండలంలోని గుడి తండా కు చెందిన 12 మంది విద్యార్థులు కారేపల్లి లోని విద్వాన్ స్కూల్లో చదువుతున్నారు. మేకల తండాకు చెందిన ఆటో డ్రైవర్ ఆకాశ్ఈ విద్యార్థులందరినీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే విధంగా ఎంగేజ్ కి మాట్లాడుకున్నాడు. ఎర్రబోడు కు చెందిన ముగ్గురు విద్యార్థులు, గుడి తండా కు చెందిన 12 మంది విద్యార్థులు ఈ ఆటోలో రోజు స్కూల్ కి వెళ్లి వస్తుంటారు.
అదే క్రమంలో సోమవారం సాయంత్రం స్కూల్ విడిచిన తర్వాత ఆటో విద్యార్థులను ఎక్కించుకొని బయలుదేరింది. ముగ్గురు విద్యార్థులను ఎర్రబోడు లో దింపి గుడి తండా వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. రెండో తరగతి చదువుతున్న భూక్య యువన్షీ , ఐదో తరగతి చదువుతున్న భూక్య వైష్ణవి, ఎల్కేజీ చదువుతున్న విగ్నేష్ తీవ్రంగా గాయపడడంతో ఈ ముగ్గురిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
మరో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ ఆకాష్ కూడా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. కారేపల్లి ఎస్సై రాజారాం సంఘటన స్థలం సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.