మోడీ కేబినెట్‌లో ఈ ఆరుగురూ కీలకమే

కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ కొత్త కేబినెట్​లో ఆరుగురు ఆడవారికి చోటు లభించింది. అయితే మోడీ ఫస్ట్ టర్మ్​  కేబినెట్ లో  మహిళల సంఖ్య ఎనిమిది కాగా ఈసారి అది ఆరుగురుకే అవకాశం దొరికింది. కేబినెట్​లో పదిశాతం మహిళలకు కేటాయించారు.

లోక్‌సభలో 78 మంది మహిళలు

16వ లోక్ సభకు 62 మంది ఆడవారు ఎన్నిక కాగా ఈసారి 78 మంది ఎన్నికయ్యారు. వీరిలో  27 మంది సిట్టింగ్ ఎంపీలున్నారు. వీరిలో యూపీ, పశ్చిమ బెంగాల్ నుంచి 11 మంది చొప్పున ఉన్నారు. మొదటి లోక్ సభ ఎన్నికలు జరిగిన 1952 నుంచి లెక్కలు తీస్తే  78 మంది మహిళలు గెలవడం ఇదే తొలిసారి. అలాగే బీజేపీ కి చెందిన 16 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు.

స్మృతి ఇరానీ

ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు స్మృతి ఇరానీ.యూపీలోని అమేథీ సీటుకు ఇందిరా గాంధీ కుటుంబ నియోజకవర్గంగా పొలిటికల్ సర్కిల్స్ లో పేరుంది. సంజయ్, రాజీవ్, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచి లోక్ సభలోకి అడుగుపెట్టారు. ఇంత చరిత్ర ఉన్న అమేథీ నుంచి 2014 లో స్మృతి ఇరానీ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓటమితో ఆమె కుంగిపోలేదు. నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. అమేథీ  ప్రజలతో మమేకం అయ్యారు. రాహుల్ వైఫల్యాలనే ఆయుధంగా మరల్చుకున్నారు. అమేథీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారికి చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చారు. దీంతో అమేథీ ప్రజలు అమెను అక్కున చేర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీని గెలిపించారు.

టీవీ నటిగా ఉన్నప్పుడే  ఆమె రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. బీజేపీలో చేరారు. వాగ్దాటితో అమె అందరినీ ఆకట్టుకుంటారు. మోడీ కేబినెట్ లో సమాచార, ప్రసార శాఖామంత్రిగా పనిచేశారు. అమేథీ నుంచి గెలిచి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. స్మృతికి మహిళా, శిశు సంక్షేమం పోర్టుఫోలియో దక్కింది.

నిర్మలా సీతారామన్ 

నిర్మలా సీతారామన్  కిందటి  కేబినెట్ లో కూడా పనిచేశారు. రక్షణ మంత్రిగా పనిచేశారు. మన దేశ తొలి మహిళా డిఫెన్స్ మినిస్టర్ గా రికార్డు సృష్టించారు. అయితే అంతకు ముందు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ మంత్రిత్వ శాఖను కూడా చూశారు. నిర్మల తమిళనాడు ఆడపడుచు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1959 ఆగస్టు 18న పుట్టారు.  2017 లో నిర్మలను డిఫెన్స్ మినిస్టర్​గా  ప్రధాని మోడీ నియమించారు.    రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పై పార్లమెంటు లోపల, బయటా దుమారం చెలరేగినపుడు ఆ ఆరోపణలను నిర్మలా సీతారామన్ సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొన్నారు. పార్లమెంటు లోపల రాహుల్ ఆరోపణలు చేసినప్పుడు రక్షణ మంత్రి హోదాలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. రాఫెల్ పై వచ్చిన అన్ని ఆరోపణలకు ప్రభుత్వం తరఫున ఆమే సమాధానం ఇచ్చి  ప్రశంసలు అందుకున్నారు. మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. లేటెస్ట్ గా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా  ఆమె నియమితులయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత మహిళ ఫైనాన్స్ మినిస్టర్​గా నియమితులైన ఘనత నిర్మల దక్కించుకున్నారు. ఇందిరా గాంధీ 1970–71 లో  ఫైనాన్స్ మినిస్టర్​గా పనిచేశారు.

హర్ సిమ్రత్ కౌర్ బాదల్

బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)  కేండిడేట్‌గా భటిండా నుంచి గెలిచిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్‌కి మోడీ రెండో కేబినెట్‌లో చోటు దొరికింది. ఈసారి శిరోమణి అకాలీదళ్ నుంచి కేవలం ఇద్దరే గెలిచారు. ఒకరు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కాగా, రెండో వ్యక్తి ఆమె భర్త సుఖ్ బీర్ సింగ్ బాదల్. హర్ సిమ్రత్ కౌర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 2014 లో  భటిండా నుంచి గెలిచిన తర్వాత మోడీ తొలి కేబినెట్ లో మంత్రిగా చేరారు. ఫుడ్ ప్రాసెసింగ్ పోర్టు ఫోలియో నిర్వహించారు.

 

దేబశ్రీ  చౌధురీ

తాజా కేబినెట్ లో మహిళా, శిశు సంక్షే శాఖ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేబశ్రీ  చౌధురీ పశ్చిమ బెంగాల్లోని రాయ్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు  ఎన్నికయ్యారు. ఆమె లోక్ సభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్ బీజేపీలో   దేబశ్రీ  చౌధురి సీనియర్ లీడర్.బీజేపీ రాష్ట్ర శాఖకు జనరల్ సెక్రెటరీగా ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు.  బెంగాల్ లో బీజేపీ ని బలోపేతం చేయడానికి ఆమె తీవ్రంగా కృషి చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో  దేబశ్రీ బుర్ద్వాన్ దుర్గాపూర్ సీటు నుంచి పోటీ చేసి తృణమూల్ కేండిడేట్ సంఘమిత్ర చేతిలో  ఓడిపోయారు.  లేటెస్ట్ గా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కేండిడేట్ అగర్వాల్ కన్హయలాల్ ను 60,574 ఓట్ల మెజారిటీతో ఆమె ఓడించారు. ఈ ఎన్నికల్లో దేబశ్రీ చౌధురీ 40.06 ఓట్ షేర్ తెచ్చుకున్నారు.

సాధ్వి నిరంజన్ జ్యోతి

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ నుంచి గెలిచిన సాధ్వి నిరంజన్ జ్యోతికి గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. నిరంజన్ జ్యోతి కేంద్ర మంత్రి కావడం ఇది రెండోసారి. మోడీ తొలి కేబినెట్లో ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో ఆమె యూపీ లోని ఫతేపూర్ నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఫతేపూర్ నుంచి ఎన్నికయ్యారు.  అంతకుముందు 2012 నుంచి 14 వరకు హమీర్ పూర్ నియోజకవర్గం నుంచి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఆమె ఎన్నికయ్యారు. అడవులను కాపాడుకుంటూనే భవిష్యత్ తరాలు పచ్చగా ఉంటాయని ఆమె అంటారు. చెట్లు కొట్టేయడాన్ని ఆమె  తీవ్రంగా వ్యతిరేకించారు. తనను కలవడానికి వచ్చే ప్రజలను మొక్కలు నాటమని చెప్పేవారు.

రేణుకా సింగ్ సరుతా

తాజా ఎన్నికల్లో గెలిచి రేణుకా సింగ్ సరుతా తొలిసారి లోక్‌షభకు ఎన్నికయ్యారు. చత్తీస్‌గఢ్‌లోని సర్గుజా నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు. సర్గుజా నియోజకవర్గం నుంచి గెలిచిన మహిళా ఎంపీగా రేణుకా సింగ్ రికార్డు సొంతం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల లీడర్‌గా రేణుక పాపులర్.  చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి రెండు సార్లు ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. రమణ్ సింగ్ ప్రభుత్వంలో 2003 నుంచి 05 వరకు  మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. సర్గుజా నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్  ఖేలాసయ్ సింగ్‌ను లక్షా యాభై వేల ఓట్ల మెజారిటీతో  రేణుక ఓడించారు.

సీనియర్లు, జూనియర్ల మధ్య బ్యాలెన్స్

ఈసారి కేబినెట్ లో బెర్త్ దొరికిన ఆరుగురిలో నలుగురికి  మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రేణుకా సింగ్ సరుతా, దేబశ్రీ చౌధురి కొత్తగా మంత్రులయ్యారు. సీనియర్లు, జూనియర్ల మధ్య బ్యాలెన్స్ చేస్తూ  వారిని కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.