- డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బాలుడి తల్లికి ఉద్యోగం
ఎల్బీనగర్, వెలుగు : హయత్నగర్గవర్నమెంట్స్కూల్గేటు ఊడి పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం మంగళవారం రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే డబుల్ బెడ్రూమ్ఇల్లు, బాలుడి తల్లికి కాంట్రాక్ట్పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రంగారెడ్డి డీఈఓ సుశీందర్ రావు హామీ ఇచ్చారు. స్థానిక ముదిరాజ్ కాలనీకి చెందిన అలంకటి అజయ్(6) సోమవారం హయత్నగర్గవర్నమెంట్స్కూలులో ఆడుకుంటుండగా, గేటు ఊడి మీద పడడంతో చనిపోయాడు.
తమకు న్యాయం చేయాలని బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం స్కూల్ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ నాయకులు గుండె శివకుమార్, స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జి భాస్కర్ పాల్గొని మద్దతు తెలిపారు. టీచర్ల నిర్లక్ష్యంతోనే అజయ్చనిపోయాడన్నారు. స్కూల్లో కనీసం వాచ్మెన్లేరని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రంగారెడ్డి డీఈఓ సుశీందర్ రావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి స్కూలుకు చేరుకున్నారు.
విద్యార్థి కుటుంబ సభ్యులతో చర్చించారు. అక్కడే కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈఓ ఫోన్లో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.4లక్షల నష్టపరిహారం, డబుల్ బెడ్రూమ్ఇల్లు, బాలుడి తల్లికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన విరమించారు. విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసినట్లు హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.