అబిడ్స్‌లో బాలిక కిడ్నాప్ 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

అబిడ్స్‌లో బాలిక కిడ్నాప్ 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

బషీర్ బాగ్, వెలుగు : హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఆరేండ్ల బాలిక శనివారం సాయంత్రం కిడ్నాప్​కు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో  రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో 12 గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ పసిగట్టి, నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ కేసు వివరాలను అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అబిడ్స్ సీఐ శ్రీనివాస్ , ఏసీపీ చంద్రశేఖర్ తో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ ఆదివారం వెల్లడించారు.  

బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అబిడ్స్ కట్టెలమండి ప్రాంతంలోని ఆమె తల్లి నివాసానికి తన అన్న కూతురైన ఆరేండ్ల చిన్నారితో కలిసి వెళ్లింది.  ప్రియాంక సోదరి  కొడుకు వృతిక్ (4) తో కలిసి ఇంటివద్ద ఉన్న ముత్యాలమ్మ ఆలయం వద్ద అడుకొనేందుకు చిన్నారి వెళ్లింది. కొద్దిసేపటికి వృతిక్ ఒక్కడే ఇంటికి రావడంతో.. ఆందోళనకు గురైన ప్రియాంక చుట్టుపక్కల, తెలిసిన వారి ఇండ్లల్లో వెతికినా.. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సాయంత్రం  అబిడ్స్ పోలీసులకు ప్రియాంక ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , 6 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసిన పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టారు.  సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఓ అగంతకుడు పాపను వెంటబెట్టుకొని వెళ్తున్నట్టు గుర్తించారు. అబిడ్స్ నుంచి ఆటో లో పాపను తీసుకెళ్లిన అగంతకుడు అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ లో దిగి , అక్కడి నుంచి జేపీ దర్గా కు ఆర్టీసీ బస్సులో వెళ్లినట్టు  తెలుసుకున్నారు. హుటాహుటిన జేపీ దర్గా ప్రాంతానికి చేరుకున్న ప్రత్యేక టీమ్  పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడబట్టారు.

చివరికి ఆదివారం ఉదయం కొత్తూరు మండలం ఇనుముల నర్వ గ్రామ సమీపంలో బాలికను తీసుకొని వెళ్తున్న వ్యక్తిని  గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.  రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు, గ్రామస్తుల సహకారంతో అబిడ్స్ పోలీసుల బృందం చిన్నారిని, నిందితుడిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. బిహార్ రాష్ట్రం భగల్పూర్ జిల్లా సుల్తాన్ గంజ్ పీఎస్ పరిధిలోని దిల్గాగౌరీ గ్రామానికి చెందిన మహ్మద్ బిలాల్ (32)ను కిడ్నాపర్ గా గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చెయ్యాలని బిలాల్​ పథకం వేసినట్టు డీసీపీ తెలిపారు. 

నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు..

నిందితుడు మహ్మద్ బిలాల్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఫుట్ పాత్ పై ఉంటూ కోఠిలోని గోకుల్ చాట్ బండార్ లో కొన్ని రోజులు పనిచేసినట్టు డీసీపీ అక్షాన్ష్ యాదవ్  తెలిపారు. కొత్తూరులోని ఓ కన్​స్ట్రక్షన్​ కంపెనీలో పనిచేసే వాడని, ఇతనికి నర్వ గ్రామంలో ఓ గది కూడా ఉన్నట్టు వెల్లడించారు. కిడ్నాప్ చేసిన పాపను శనివారం సాయంత్రం అఫ్జల్​గంజ్​ నుంచి ఆర్టీసీ బస్సులో తన గదికి తీసుకువెళ్లాడని, సైకిల్ కొనిస్తానని, మీ డాడీ దగ్గరకు తీసుకువెళ్తానంటూ నమ్మబలికినట్టు డీసీపీ తెలిపారు. ఉదయం బాలికను తీసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

నిందితుడికి నేర చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. బిహార్ లో హీరో హోండా బైక్ దొంగతనం కేసులో 9 నెలల జైలు శిక్ష అనుభవించాడని, 11 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన కేసులో 2 ఏండ్ల 2 నెలలు బిహార్ లోనే జైలు శిక్ష అనుభవించినట్టు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొత్తూరు పరిధిలో 8 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న ఇతను పరారీలో ఉన్నట్టు చెప్పారు. మరో దొంగతనం కేసులోనూ కొత్తూరు స్టేషన్ లో బిలాల్​పై కేసు నమోదై ఉన్నట్టు వెల్లడించారు.కాగా, నిందితుడిని  పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా, అప్పటికే అక్కడ ఉన్న చిన్నారి కుటుంబీకులు, బంధువులు ఒక్కసారిగా నిందితుడిపై దాడికి పాల్పడ్డారు. 

వైద్య పరీక్షల కోసం భరోసా సెంటర్​కు చిన్నారి

చిన్నారిని కిడ్నాప్ చేసి వెంట తీసుకువెళ్లిన నిందితుడు రాత్రంతా గదిలో ఉండటం వల్ల ఏదైనా అఘాయిత్యం చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపను భరోసా సెంటర్ కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారి మెడికల్ రిపోర్ట్స్ కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఒక వేళ పాపపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయితే అతడిపై ఫోక్సో కేసు  నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.