హైదరాబాద్‌లో ఒక్కరోజే ఆరుగురు సూసైడ్

 హైదరాబాద్‌లో ఒక్కరోజే ఆరుగురు సూసైడ్

సిటీలో ఒక్కరోజు పరిధిలోనే ఆరుగురు క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నారు. ప్రియురాలికి వీడియో కాల్​చేసి ఓ యువకుడు ఉరేసుకోగా, అనారోగ్య సమస్యలతో సాఫ్ట్​వేర్ ఉద్యోగిని ప్రాణాలు తీసుకుంది. మరోచోట ప్రిన్సిపల్ తిట్టాడని బాలుడు, జాబ్​ రాలేదని నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసై మరొకరు.. చెరువులో పడి ఇంకొకరు మృతి చెందారు.

గచ్చిబౌలి, వెలుగు: రాయదుర్గంలో ఓ యువకుడు ఉరేసుకొని మృతి చెందాడు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన ధర్మ ప్రధాన్​(29) రాయదుర్గం అపర్ణ కన్​స్ట్రక్షన్ లోని​లేబర్​ క్యాంపులో ఉంటూ క్రేన్​ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో మాట్లాడుకోవడం లేదు. అయితే మంగళవారం సాయంత్రం నార్సింగిలో నివాసం ఉండే తన ఫ్రెండ్​కు వీడియో కాల్​చేసి మాట్లాడాడు. ఆ తర్వాత యువతికి వీడియో కాల్​చేసి మాట్లాడుతూనే.. తన రూమ్​లో ఫ్యాన్​కు ఉరేసుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మాదాపూర్:  మాదాపూర్​లో అనారోగ్య సమస్యలతో హాస్టల్​బిల్డింగ్​నుంచి దూకి సాఫ్ట్​వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మాదాపూర్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్​బెంగాల్​కు చెందిన రిటోజా బసు(22) గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్​ఉద్యోగిని. మాదాపూర్​సిద్ధిక్​నగర్​లోని జోలో స్టెర్లింగ్​కోలివింగ్ హాస్టల్లో తన ఫ్రెండ్​హార్ష్​తో కలిసి ఉంటోంది. ఈ నెల 3న రాత్రి 10.30 గంటల సమయంలో తాను నివాసం ఉంటున్న హాస్టల్​ఆరో ఫ్లోర్​నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు, హాస్టల్​నిర్వాహకులు సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇంద్రజిత్​ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

బషీర్ బాగ్: బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదన్న బాధ.. మరోవైపు కుటుంబ కలహాలతో ఓ యువకుడు రైలు కిందపడి చనిపోయాడు. కాచిగూడ రైల్వే సీఐ ఎల్లప్ప వివరాల ప్రకారం... విద్యానగర్ కు చెందిన పోచయ్య కొడుకు మణికంఠ(33) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయతిస్తున్నాడు. జాబ్ రాకపోవడంతో మనోవేదన గురై బుధవారం విద్యానగర్-, జామే ఉస్మానియా రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి మృతి చెందాడు.

షాద్ నగర్: స్కూల్​లో​ప్రిన్సిపల్​తిట్టాడని టెన్త్​స్టూడెంట్​సూసైడ్ చేసుకున్నాడు. షాద్ నగర్​కు చెందిన హరి బుషన్ కొడుకు నీరజ్(15) స్థానికంగా ఉన్న శాస్త్ర ప్రైవేట్ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. నీరజ్ బుధవారం పాఠశాలలో మరో విద్యార్థితో బాల్కనీలో మాట్లాడుతుండగా, ప్రిన్సిపల్ ఇరువురిని పిలిచి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన నీరజ్ టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అనంతరం భవనంపైకి ఎక్కి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రిన్సిపల్ నిర్వాకం వల్లే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

బడంగ్​పేట: మీర్​పేటలో చెట్టుకు ఉరేసుకొని మరొకరు మృతి చెందారు. సర్వదయ నగర్ చెందిన వెంకటేశ్( 52) మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున మంత్రాల చెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.

 
దిల్ సుఖ్ నగర్: సరూర్ నగర్ చెరువు నాలాలో బుధవారం మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా పీర్జాదిగూడకు చెందిన నాగమల్ల బాలరాజ్( 60) గా గుర్తించారు.