చండ్రుగొండ, వెలుగు: నోట్ బుక్ కొనేందుకు పది రూపాయలు కావాలని తల్లిని అడగ్గా ఇప్పుడు లేవని చెప్పడంతో మనస్తాపానికి గురైన కొడుకు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో కణితి లక్ష్మణరావు, కుమారిలకు సుధీర్(10), శివ కొడుకులు.
సుధీర్ గ్రామంలోని యూపీఎస్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. బుధవారం తనకు నోట్ బుక్ కొనేందుకు రూ.10 కావాలని తల్లిని అడిగాడు. ఇప్పుడు డబ్బులు లేవని రేపు కొనిస్తానని చెప్పి కూలీ డబ్బుల కోసం గ్రామంలోకి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన సుధీర్ ఇంట్లో ఎవరూ లేని టైంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
తల్లి ఇంటికి తిరిగి రాగా కొడుకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దింపి చూడగా కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే చండ్రుగొండ పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం లోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.