
తెలుగు రాష్ట్రాల్లో హార్ట్ ఎటాక్ లు కలవరపెడుతున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. లేటెస్ట్ గా మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల చిన్నారి గుండె పోటుతో చనిపోయింది. హార్ట్ ఎటాక్ తో ఆరవ తరగతి స్టూడెంట్ స్రవంతి మృతి చెందింది. మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో ఈ విషాదం నెలకొంది.
మార్చి 30న శ్రీరామ నవమి వేడుకల్లో తోటి చిన్నారులతో పొద్దంతా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి రాత్రి పడుకునే సమయంలో గుండెపోటుతో చనిపోయింది. బోడతండాకు చెందిన బోడ లకపతి, బోడ వసంతలకు ఇద్దరు సంతానం. రెండో కుమార్తె స్రవంతి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. నాయనమ్మ దగ్గర పడుకున్న చిన్నారిని తెల్లవారుజామున లేపే సరికి ఒక్కసారిగా కుప్పకూలింది. బాబాయ్ సీపీఆర్ చేసి వెంటనే ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే బాలిక చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మార్చి 31న పెద్ద అంబర్ పేటలో ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు.