హైదరాబాద్లో ఆరో రోజు 1,45,896 కుటుంబాల సర్వే

హైదరాబాద్లో ఆరో రోజు 1,45,896 కుటుంబాల సర్వే

హైదరాబాద్ సిటీ, వెలుగు : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు 10 రోజులే మిగిలి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం   28,30,390 కుటుంబాలు ఉండగా, ఇప్పటి వరకు 5,90,161 కుటుంబాల సర్వే మాత్రమే పూర్తయింది. వివిధ కారణాలతో మొదటి రెండు రోజులు సర్వే ముందుకు సాగలేదు. మొదటిరోజు 12,912, రెండో రోజు 56,712 కుటుంబాల వివరాలను మాత్రమే అధికారులు సేకరించారు. మూడోరోజు 88,516, నాలుగో రోజు 1,40,224, ఐదో రోజు1,45,901 కుటుంబాల సర్వే పూర్తయింది. ఆరో రోజైన బుధవారం 1,45,896 కుటుంబాల సర్వే జరిగింది.

ఈ నెల 24 వరకు సర్వే కొనసాగనుండగా, 10 రోజుల్లో 23 లక్షల కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉంది. సర్వే కోసం పనిచేస్తున్న 18,419 మంది ఎన్యుమరేటర్లు, 1,745 సూపర్ వైజర్లు ఎంత వేగంగా చేపట్టినా రోజుకు లక్షన్నర కుటుంబాలు మించే అవకాశంలేదు. నిర్ణీత గడువులోపు సర్వే పూర్తి కావాలంటే ఎన్యుమరేటర్ల సంఖ్య పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదా గడువును పెంచాలని అధికారులు  కోరుతున్నారు.

ఒక్కో కుటుంబం వివరాలు సేకరించేందుకు 50 నిమిషాలకుపైగా సమయం పడుతోందని, గతంలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని, ఇప్పుడు మళ్లీ సర్వే పేరుతో ఎందుకు వివరాలు తీసుకుంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.