- మెడికల్ కాలేజీలో ఈ-లైబ్రరీకి 40 కంప్యూటర్లు
- అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కొత్తగా చేపట్టిన పనులు, పెండింగ్ వర్క్స్ పై కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రకటించడంతో పాటు అందులో నిర్వహించాల్సిన కోర్సులు
వసతుల గురించి సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. కమర్షియల్ వెహికిల్ మెయింటనెన్స్ , మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్, హైడ్రాలిక్ మెషిన్ ట్రైనింగ్, అడ్వాన్సుడ్ వుడ్ ఇంజినీరింగ్, అపెరల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్, కేఫ్ కాఫీ డే లాంటి బిజినెస్ మోడల్స్ గురించి చర్చించారు.
క్రిటికల్ కేర్ భవనానికి శంకుస్థాపన
ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. 23.75 లక్షలతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో ఫిబ్రవరి నెలాఖరులోగా వైద్య పరికరాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ–లైబ్రరీలో సొంత నిధులతో 40 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆటో క్లేవ్, బ్లడ్ బ్యాంక్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మాటిచ్చారు.
కాలేజీలో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ల్యాప్రో స్కోపిక్ మెషిన్, ఇతర సమస్యల గురించి వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రిన్సిపల్ రాజకుమారి, వైస్ ప్రిన్సిపాల్ నిత్యానంద, డీఎంహెచ్‌వో కొండల్ రావు పాల్గొన్నారు.