సింగరేణిలో ఐఎన్​టీయూసీని గెలిపిస్తే.. పైరవీలు బంద్​ : వివేక్ ​వెంకటస్వామి

  • పారదర్శకంగా డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ   
  • త్వరలో స్కిల్​ డెవలప్​మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తం
  • కొత్త మైన్స్ తో యువతకు మరిన్ని జాబ్​లు కల్పిస్తం 
  • ‘మీట్​ది ప్రెస్’లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్​టీయూసీని గెలిపిస్తే మెడికల్ బోర్డును ప్రక్షాళన చేస్తామని, పైరవీలకు తావు లేకుండా అర్హులైన కార్మికులందరికీ డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ వర్తింపజేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత  డాక్టర్​జి.వివేక్​వెంకటస్వామి చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్​ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్​ది ప్రెస్’ ​కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. 23 రోజుల ముందే తాను ఎన్నికల బరిలోకి దిగినా, చెన్నూరు ప్రజలు తనను భారీ మోజార్టీతో గెలిపించారన్నారు. 

నియోజకవర్గ పరిధిలో వనరులు పుష్కలంగా ఉన్నాయని.. బొగ్గు, వాటర్, పవర్, భూమి తదితర వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి ఫండ్స్ తెచ్చి సింగరేణికి అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్లాన్ తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన మాట ప్రకారం 40 వేల ఉద్యోగాలు ఇస్తానని, అందుకోసం రెండు స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సింగరేణి ఓసీపీలు, పవర్ ప్లాంట్​లోని ఔట్ సొర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు దక్కేలా జీవో తెచ్చామన్నారు. 

సింగరేణికి అనుబంధంగా విజయవాడలో ఉన్న అప్మెల్​ను తెలంగాణకు తరలిస్తానని గత సీఎం ​మాట తప్పారన్నారు. సుప్రీంతీర్పు మేరకు బొగ్గు గనులకు ఓపెన్​టెండర్ కొనసాగుతుందని, కొత్త గనులను  దక్కించుకోవడానికి కేసీఆర్ కనీసం కేంద్రానికి లెటర్ రాయలేదన్నారు. మందమర్రి ఏరియాలో కేకే6, శ్రావణపల్లి కొత్త బొగ్గు గనులు వస్తే  ప్రత్యక్షంగా 5 వేల మందికి,  పరోక్షంగా మరో 5 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. డీఎంఎఫ్​టీ, సీఎస్సార్ ఫండ్స్ ను ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేస్తామన్నారు. సింగరేణిలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. 

కార్మికులకు అండగా ఉంటాం..  ఐఎన్​టీయూసీని గెలిపిస్తే కాంగ్రెస్ సర్కార్ కార్మికులకు అండగా ఉంటుందని, సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయనివ్వబోమని వివేక్ వెంకటస్వామి చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు మంచి వేతనాలు ఇప్పిస్తామని, రిటైర్డ్​కార్మికులకు ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సొంతింటి పథకం ద్వారా కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామన్నారు.  పెర్క్స్​పై ఇన్​కమ్ ట్యాక్స్​ను యాజమాన్యం చెల్లించేలా చూస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని, సింగరేణి ఆసుపత్రుల నుంచి నేరుగా హైదరాబాద్​కు రెఫరల్ పంపేలా చూస్తామన్నారు. సింగరేణి నిర్వహణలో ప్రభుత్వం, ఐఎన్​టీయూసీ జోక్యం చేసుకోవని, కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసమే పని చేస్తామన్నారు.

కాకా వల్లే లక్ష మంది జాబ్​లు నిలబడ్డయ్ 

సింగరేణి బీఐఎఫ్ఆర్​ పరిధిలోకి వెళ్తే సంస్థను కాపాడేందుకు తన తండ్రి కాకా వెంకటస్వామి అప్పటి ప్రధాని పీవీపై ఒత్తిడి తెచ్చి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లను ఇప్పించారని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చెప్పారు. కాకా వల్ల లక్ష మంది సింగరేణి కార్మికుల ఉద్యోగాలు నిలబడ్డాయని గుర్తు చేశారు. కాకా కృషి వల్లే జైపూర్​లో1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటైందన్నారు. ఈ ప్లాంట్​లో 850 మెగావాట్ల మూడో యూనిట్ ప్రారంభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తానన్నారు. 

అప్పట్లో తాడిచెర్ల మైన్ ను ప్రైవేట్ పరం కాకుండా గులాం నబీ ఆజాద్, రోశయ్యతో మాట్లాడి తానే అడ్డుకున్నట్లు చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక  తాడిచెర్ల మైన్ ను సింగరేణి నుంచి జెన్ కోకు కేటాయించి.. జెన్​కో ద్వారా ఏఎమ్మాఆర్ కంపెనీకి అప్పగించారని, ఇందులో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అంతకుముందు సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రి ఏరియాలోని కాసీపేట1, కాసీపేట2, ఏరియా వర్క్​షాప్, ఏరియా స్టోర్స్, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్​లో ఉద్యోగులతో వివేక్ మాట్లాడారు. ఐఎన్ టీయూసీలో చేరిన పలువురు టీబీజీకేఎస్ లీడర్లను ఆయన కండువా వేసి ఆహ్వానించారు.