
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో త్వరలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ ఏరియా జీఎం ఎ.మనోహర్ తెలిపారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని సింగరేణి ప్రాంతాల యువతీయువకులు అర్హులని స్పష్టం చేశారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంగళవారం మందమర్రిలోని ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రీజినల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యుర్షిప్(ఆర్డీఎస్డీఈ), తెలంగాణ స్టేట్మినిస్ట్రీ ఆఫ్స్కిల్డెవలప్మెంట్ అండ్ఎంటర్ ప్రెన్యుర్షిప్ సహకారంతో మొత్తం 8 వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాస్మోటాలజీ(మహిళలు), డ్రోన్ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్, సెల్ టెక్నీషియన్, టూవీలర్ మోకానిక్, ఆర్క్ అండ్గ్యాస్ వెల్డింగ్, కంప్యూటర్ -డీటీపీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సులపై శిక్షణ ఉంటుందన్నారు. కాస్మోటాలజీ కోర్సుకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదని, ఇతర కోర్సులకు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, టెన్త్ పాసై ఉండాలన్నారు. ఒక్కో బ్యాచ్లో 20 మందికి శిక్షణ ఉంటుందని చెప్పారు.
బెల్లంపల్లి, రామగుండం సింగరేణి రీజియన్పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామగుండం1, రామగుండం2, రామగుండం3, ఏఎల్పీ, భూపాలపల్లి సింగరేణి ఏరియాలకు చెందిన 18 నుంచి 42 ఏళ్ల వయస్సున్న యువతీయువకులు www.scclmines.com/apprenticeship లో రిజిస్ట్రేషన్చేసుకోవచ్చని, 16 తేదీ లోపు అప్లికేషన్లు సమర్పించాలని జీఎం మనోహర్సూచించారు. అలాగే మందమర్రి సింగరేణి ఎంవీటీసీ సెంటర్లో నేరుగా దరఖస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ పూర్తయ్యాక ఆర్డీఎస్డీఈ- సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. శిక్షణకు వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని కోర్సులపై శిక్షణ ఇచ్చేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తుందని చెప్పారు.
16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనవద్దు
ఈ నెల16న కార్మిక సంఘాల తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులెవ్వరూ పాల్గొనవద్దని మందమర్రి ఏరియా జీఎం మనోహర్ కోరారు. సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని చెప్పారు. సమ్మెలో పాల్గొంటే కార్మికులు ఒక్కరోజే రూ.6 వేల చొప్పున నష్టపోతారని, 2.15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందన్నారు. సమావేశంలో ఏరియా ఎస్ఓటూ జీఎం రాజేశ్వర్రెడ్డి, పర్సనల్ మేనేజర్శ్యాంసుందర్, డీవైపీఎం మైత్రేయబంధు, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.