- సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు
- గోదావరిఖనిలో స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణం
- 38 కోర్సుల్లో ట్రైనింగ్, ఉపాధి నేడు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతతోపాటు కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించేందుకు మేనేజ్‌మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో సెంటర్ ఏర్పాటు చేయగా, రెండో సెంటర్‌ను రామగుండం రీజియన్ పరిధిలోని గోదావరిఖని తిలక్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ.కోటి వ్యయంతో 10 గదులతో బిల్డింగ్ నిర్మించారు. ఈ ట్రైనింగ్ సెంటర్‌లో 38 ఉపాధి కోర్సులపై ట్రైనింగ్ ఇచ్చేలా మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సెంటర్ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించనున్నారు.
ఉపాధి పొందేలా కోర్సులు
డిగ్రీ, డిప్లోమా, ఐటీఐ, టెన్త్ చదివిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ విభాగం 38 కోర్సులను రూపొందించింది. కాగా ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఉపయోగపడే సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నిషియన్, కంప్యూటర్, డీటీపీ, ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, కాస్మేటాలజీ, ఇంటర్నేట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), సెల్‌ఫోన్, టూ వీలర్ మెకానిక్.. వంటి కోర్సులను నేర్పించనున్నారు. శనివారం మాత్రం డిప్యూటీ సీఎం సోలార్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. 18 నుంచి 42 ఏండ్ల ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
యువతుల కోసం ప్రత్యేక కోర్సులు
సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల యువతుల కోసం కూడా ప్రత్యేకంగా కోర్సులను రూపొందించారు. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, జ్యూట్, పేపర్ బ్యాగ్స్ తయారీ, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రాప్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ కోర్సులు నేర్పించనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఉపాధి పొందేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ALSO READ : సంగారెడ్డిలో చెత్త సమస్యకు పరిష్కారమెప్పుడు?
ఎంవోయూ తర్వాత ట్రైనింగ్ స్పీడప్
సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువత, కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నాం. సెంచేరియన్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నాం. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను స్పీడప్ చేస్తాం. శిక్షణ కోసం అర్హులైన నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆర్జీ 1 జీఎం ఆఫీస్‌లోని పర్సనల్ డిపార్ట్మెంట్లో అందజేయాలి. - డి.లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ 1