సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం.. స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్​లో పరస్పర సహకారం

  • త్వరలోనే హైదరాబాద్​కు ఐటీఈ ప్రతినిధుల బృందం 
  • సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో తొలిరోజే కీలక ఎంవోయూ

హైదరాబాద్, వెలుగు: స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్​లో యంగ్​ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్​లోని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) ముందుకొచ్చింది. స్కిల్ వర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం సింగపూర్​లో పర్యటించింది. ఈ సందర్భంగా ఐటీఈ క్యాంపస్​ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్​మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. క్యాంపస్​లో శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడింది. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. 

రేవంత్ బృందానికి ఘన స్వాగతం.. 

హైదరాబాద్​లోని ఫోర్త్​సిటీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించాలని ఐటీఈ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్​లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. చర్చల అనంతరం ఐటీఈ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. స్కిల్ వర్సిటీతో కలిసి పని చేసేందుకు అంగీకరించారు. దీంతో ఐటీఈ, స్కిల్ వర్సిటీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందంపై స్కిల్ వర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ అకడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ ను సందర్శించనుంది. ఈ సమావేశంలో  పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. 

సింగపూర్ మంత్రితో సీఎం భేటీ.. 

తొలిరోజు పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిపారు. విస్తృత సహకారంతో పాటు పలు అంశాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ప్రధానంగా దృష్టిసారించారు.