- ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- 17 రంగాల్లో కోర్సులు..ఏటా 20 వేల మందికి అడ్మిషన్లు
- ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ
- హైదరాబాద్లోనే మెయిన్ క్యాంపస్
- ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’గా పేరు ఖరారు
హైదరాబాద్, వెలుగు: ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెడతామని, ముసాయిదా సిద్ధం చేయా లని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించా లనే లక్ష్యంతో ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. దీని ఏర్పాటు, నిర్వహణకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్కిల్స్ వర్సిటీపై శుక్రవారం సెక్రటేరియెట్లో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమల విభాగం ఇప్పటికే నమూనా ముసాయిదా తయారు చేసింది. ఈ వర్సిటీలో ఉండే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, మౌలిక వసతులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నమూనా ముసాయిదాలో సీఎం రేవంత్ పలు మార్పులు సూచించారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
పీపీపీ మోడల్లో నిర్వహణ..
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్) స్కిల్స్ వర్సిటీ నెలకొల్పుతారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు, నాలుగేండ్ల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది ఉండే డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి తెస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.
తొలుత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఫార్మా, కన్ స్ట్రక్షన్, బ్యాంకింగ్ అండ్ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ లో కోర్సులు ప్రవేశపెడతారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకోసం ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
హైదరాబాద్లోనే ట్రైనింగ్..
హైదరాబాద్లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్ తోపాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్లు) ఏర్పాటు చేయాలని సమావే శంలో చర్చ జరగింది. జిల్లా కేంద్రాల్లో శాటిలైట్ క్యాం పస్లు ఏర్పాటు చేస్తే, వాటిల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని.. అందరూ హైదరాబాద్ క్యాంపస్లో చేరేందుకు పోటీ పడతారని సీఎం అన్నారు.
అందుకే హైదరాబాద్లోనే అందరికీ శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని.. ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలన్నారు. భూదాన్ పోచంపల్లిలో ఉన్న స్వామి రామానం ద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్లో ఉన్న సదుపాయాలను అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు.
డిమాండ్ ఉన్న రంగాలపైనే ఫోకస్..
డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని.. రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని అధికారులకు సీఎం చెప్పారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని, ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సూచించారు.
మిగతా వర్సిటీలు అనుసరించిన విధానాలను పరిశీలించి, కొత్త యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసి ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు.