- వచ్చే నెలాఖరులోగా ప్రారంభించడానికి అధికారుల ఏర్పాట్లు
- 12 ఎస్కలేటర్లు, 12 లిఫ్టులు, 20 ప్యాసింజర్వేస్, 5 స్టెయిర్కేసేస్
- తీరనున్న పాదచారుల కష్టాలు
- స్కైవాక్పైన సేద దీరడానికి సీటింగ్ ఏర్పాట్లు
- టీ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్కూడా..
హైదరాబాద్ సిటీ, వెలుగు:గ్రేటర్ పరిధిలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం హెచ్ఎండీఏ స్కైవాక్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్ చౌరస్తాలో రూ.25 కోట్లతో నిర్మించిన స్కై వాక్‌తో అక్కడి పాదచారులకు మేలు జరుగుతోంది. మెహిదీపట్నం జంక్షన్లో నిర్మిస్తున్న స్కైవాక్ పనులు 90 శాతం పూర్తి కావడంతో వచ్చే నెలలో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రోడ్డు దాటాలంటే గగనమే..
మెహిదీపట్నం చౌరస్తాలో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్‌రామ్ గూడ వంటి ఐటీ ప్రాంతాలకు వెళ్లేవారు, శంషాబాద్ఎయిర్పోర్టు వైపు వెళ్లే వారితో ఈ రూట్ రోజంతా కిక్కిరిసి ఉంటుంది. ఇదే చౌరస్తాలో ఆర్టీసీ బస్టాప్‌లు ఉండడంతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ఎటు చూసినా జనమే కనిపిస్తారు.
దీంతో ఇక్కడ రోడ్డు దాటడానికి పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడిన వారు ఉన్నారు. రూ.30 కోట్లతో నిర్మిస్తున్న స్కైవాక్జనాలకు అందబాటులోకి వస్తే ప్రమాదాలు దాదాపు తగ్గే అవకాశం ఉంటుంది.
పూర్తిగా స్టీల్ స్ట్రక్చర్
మెహిదీపట్నం స్కైవాక్ ను పూర్తిగా స్టీల్స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. 380 మీటర్ల పొడవుతో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులను తొందరగా పూర్తి చేసి మార్చి నెలాఖరులో అందుబాటులోకి తీసుకు వస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, స్పెషల్ ఆర్కిటెక్చర్ తో నిర్మిస్తున్నామని , 12 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో ఎలాంటి శ్రమ లేకుండా సులువుగా పైకి ఎక్కి దిగవచ్చంటున్నారు.
12 లిఫ్టులు, 20 ప్యాసింజర్వేస్, 5 స్టెయిర్ కేసేస్ఏర్పాటు చేశారు. ఇక్కడ డిఫెన్స్ భూములు ఉండడంతో సేకరణకు ఈక్వల్వ్యాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్టక్చర్కింద రూ.15 కోట్లు చెల్లించినట్టు చెప్తున్నారు. స్కైవాక్ పై సేదదీరేందుకు ఏర్పాట్లు కూడా చేశామని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకునేందుకు, కూర్చోడానికి సీటింగ్ ఏర్పాట్లు, టీ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనివల్ల స్కైవాక్పై కొత్త అనుభూతి కలుగుతుందంటున్నారు.