
వీడియో కాలింగ్లో విశేష సేవలు అందించిన స్కైప్ ఇకపై కనుమరుగు కానుంది. స్కైప్ను కాలగర్భంలో కలిపేసే టైమొచ్చిందని మైక్రోసాఫ్ట్ డిసైడ్ అయినట్లు టెక్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2025 మే నెల నుంచి స్కైప్ సేవలు అందుబాటులో ఉండవని టాక్. మైక్రో సాఫ్ట్ టీమ్స్లో వీడియో కాల్స్, చాట్స్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించినట్లు తెలిసింది. స్కైప్ను మరింత డెవలప్ చేసి కొత్త ఫీచర్లతో యూజర్లను సంపాదించేందుకు మైక్రోసాఫ్ట్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్కైప్ క్లిప్స్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకొచ్చినా స్కైప్ వైపు యూజర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు.
కోవిడ్-19 ఉపద్రవం తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా స్కైప్ను పెద్దగా పట్టించుకోలేదు. స్కైప్ సర్వీస్కు ఆదరణ కరువైన క్రమంలో ఇక ఈ వీడియో కాలింగ్ సర్వీస్కు మంగళం పాడటమే మేలనే అభిప్రాయానికి మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. ఇప్పుడంటే వీడియో కాలింగ్కు బోలెడన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి గానీ ఒకప్పుడు స్కైప్ వీడియో కాలింగ్ సర్వీస్ ఒక ట్రెండ్ సెట్టర్. స్కైప్ వీడియో కాలింగ్ సర్వీస్ మైక్రో సాఫ్ట్ చేతికొచ్చాక బాగా పాపులర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రోజూ 36 మిలియన్ల మంది స్కైప్లో తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో సంభాషించారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.