![ఈ హెలికాప్టర్‌కు పైలట్ అవసరం లేదు](https://static.v6velugu.com/uploads/2019/12/no-pilot.jpg)
ఇప్పటిదాకా డ్రైవర్ అవసరం లేకుండా దూసుకుపోయే కార్ల గురించి విన్నాం.. చూశాం. విమానాల గురించీ విన్నాం… వాటినే డ్రోన్లు అంటున్నాం. అంతేకాదు, విమానాలకు ఇప్పటికే ఆటోపైలట్ మోడ్ ఉండనే ఉంది. మరి, హెలికాప్టర్ల సంగతేంటి? దానికి సమాధానం మేం చెబుతామంటోంది అమెరికాకు చెందిన స్కైరైజ్ అనే సంస్థ. అవును, పైలట్ అవసరం లేకుండా ప్రయాణించే హెలికాప్టర్‌ను తయారు చేసింది స్కైరైజ్. తనంతట తానే ఎగిరే ఈ హెలికాప్టర్‌కు లూనా అనిపేరు పెట్టింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ చేసి ఆమోదించింది కూడా. ఇద్దరు స్టాండ్ బై పైలట్లతో గాల్లోకి లేచిన లూనా, సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణించింది. దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఒకటి, మొత్తంగా పైలట్ అవసరం లేకుండానే ప్రయాణించే వెసులుబాటు, ఇంకోటి, క్రూయిజ్ కంట్రోల్‌లాగా కేవలం గాల్లోకి లేచే వరకు ఆటోమేషన్(దీనికి పైలట్ గైడెన్స్ తప్పనిసరి). హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, సెన్సర్ల సాయంతో లూనాను సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసినట్టు కంపెనీ చెప్పింది. ఇప్పటికే సుమారు రూ.270 కోట్లు (3.8 కోట్ల డాలర్లు) ఫండ్‌ను రైజ్ చేసింది కంపెనీ. దానికి తోడు ఇటీవలే మరో రూ.92 కోట్ల (1.3 కోట్ల డాలర్లు) ఫండ్ వచ్చినట్టు కంపెనీ తెలిపింది. అన్నీ ఓకే అయితే, త్వరలోనే ఈ అటానమస్ హెలికాప్టర్లను మార్కెట్లోకి తీసుకొస్తామని స్టార్టప్ చెప్పింది.