రాష్ట్ర ఐకాన్‌గా నిలిచే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లో స్కైవాక్ బ్రిడ్జి పూర్తయింది. ఎ, డి టవర్లకు కలుపుతూ ఈ బ్రిడ్జి పనులను 7 గంటల్లో ఇంజనీర్లు పూర్తి చేశారు. దీని లిఫ్టింగ్ పనులను శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో 4 లిఫ్ట్‌ల ద్వారా లిఫ్ట్ చేస్తూ 14వ అంతస్తులోని ఎ, డి బ్లాకులను కలిపేలా స్కైవాక్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఎ టవర్‌పై హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తుండగా, బి, సి టవర్లలలో వేర్వేరుగా 14 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు టవర్లను కలుపుతూ అయిదు స్కైవేలు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర ఐకాన్ గా నిలిచే పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఎ’, ‘డి’ టవర్లను కలుపుతూ 450 మెట్రిక్ టన్నుల ‘స్కై వాక్ బ్రిడ్జి’ ని ఏర్పాటు చేశారు. సీసీసీలోని 20అంతస్థుల ‘ఎ’ టవర్ ..14 అంతస్థుల ‘బి’ టవర్ ని కలిపే విధంగా నిర్మించిన ‘స్కై వాక్ బ్రిడ్జ్’ లిఫ్టింగ్ పనులను శని వారం ఉదయం డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. స్కై వాక్ బ్రిడ్జిని 14వ అంతస్థుకు తరలించేందుకు నిర్వహించిన పుష్పాంజలి పూజలో డీజీపీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, సీపీలు అంజనీకుమార్,మహేశ్ భగవత్ సహా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే అత్యంత బరువైన బ్రిడ్జి
సీసీసీ ‘స్కైవాక్’ దేశంలోనే అత్యంత బరువైన బ్రిడ్జిగా అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం 8.30 గంటలకు పూజ నిర్వహించిన తరువాత ప్రారంభమైన బ్రిడ్జి తరలింపు పనులకు సుమారుగా ఏడు గంటల సమయం పట్టిందని వారు తెలిపారు. ‘స్కై వాక్ బ్రిడ్జ్’ ను అత్యాధునికి టెక్నాలజీతో 4 లిఫ్ట్ ల ద్వారా లిఫ్ట్ చేశారు. 14వ అంతస్థులోని ‘ఎ’ బ్లాక్ నుంచి ‘డి’ బ్లాక్ ను కలిపే విధంగా స్కై వాక్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. 2015 నవంబర్ 22 న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. 7 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 5లక్షల చదరపు అడుగుల స్థలంలో సీసీసీ నిర్మాణం జరుగుతోంది. ఇందులో ఎ,బి,సి,డి లుగా సీసీసీ టవర్ల నిర్మాణం చేస్తున్నారు. ‘ఎ’- టవర్ 84.2 మీటర్లు, బి,సి,డి టవర్లు 65.2 మీటర్లలో నిర్మిస్తున్నారు. ‘ఎ’ -టవర్ లో మొత్తం 20 అంతస్థులు ఉంటాయి. ఇందులో ఓపెన్ కార్యాలయం, మీటింగ్ గదులు, కాన్ఫరెన్స్ హాల్, క్యాబిన్స్ ఉంటాయి. వీటితో పాటు సీఎం,హోం మినిస్టర్ కు స్పెషల్ క్యాబిన్, సీపీలకు క్యాబిన్ లు ఉంటాయి. వీటితో పాటు మల్టీపర్సస్ గదిని ఏర్పాటు చేశారు. ‘ఎ’ టవర్ పై హెలిప్యాడ్ నిర్మాణం చేస్తున్నారు. ‘బి’ -టవర్ లో మొత్తం 14 అంతస్థులు నిర్మిస్తున్నారు. ఇందులో డీజీపీ క్యాబిన్, సీఎస్ క్యాబిన్, డయల్ 100 సెంటర్ లు ఉంటాయి. ‘సి’ -టవర్ లో 14 అంతస్థులు ఉంటాయి. ఇందులో మీటింగ్ హాల్ నిర్మాణం చేశారు. ‘డి’ -టవర్ లోనూ 14 అంతస్థులు ఉన్నాయి. ఇందులో మీడియా హాల్, క్యాంటీన్,శిక్షణ తరగతుల కోసం గదుల నిర్మాణం చేశారు. వార్ రూమ్ లను నిర్మించారు. వెహికల్ పార్కింగ్ కోసం సువిశాల స్థలం కేటాయించారు. 4 టవర్లను కలుపుతూ ఐదు స్కైవేలు నిర్మించారు.