
- ఎల్బీనగర్ మెట్రో నుంచి రెసిడెన్షియల్టవర్లకు స్కైవే
- ఓ రియల్ సంస్థకు మెట్రో అనుమతులు
- సొంత ఖర్చుతో నిర్మించుకోనున్న కంపెనీ
- ప్యాసింజర్ల సంఖ్య పెంచుకునేందుకు వినూత్న పద్ధతిలో ఆలోచన
- ఇప్పటికే కమర్షియల్ మాల్స్‌కు స్కైవాక్‌లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి, వారి సౌకర్యం కోసం మెట్రో వినూత్న పద్ధతిలో ఆలోచిస్తున్నది. ఇప్పటికే కొన్ని స్టేషన్ల పక్కన నిర్మించిన మెట్రోమాల్స్ కు డైరెక్ట్ స్కైవాక్ వేసిన సంస్థ ఇప్పుడు రియల్ఎస్టేట్ సంస్థలు నిర్మిస్తున్న అపార్ట్మెంట్లకు కూడా స్కైవాక్ నిర్మించుకోవడానికి అనుమతులిస్తోంది.
గత ఏడాది నవంబర్‌లో మెట్రో పర్మిషన్తో కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ మాల్..మెట్రోస్టేషన్ నుంచి డైరెక్ట్స్కైవాక్ నిర్మించుకోగా..తాజాగా ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న భారీ హౌసింగ్ కమ్యూనిటీకి మెట్రో స్టేషన్ నుంచి స్కైవాక్ నిర్మించుకోవడానికి అనుమతులిచ్చింది.
దీంతో సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీ సొంత ఖర్చుతో స్కైవాక్ నిర్మించుకోవడానికి ప్లాన్సిద్ధం చేసుకుంది. ఇది పూర్తయితే ఆ టవర్లలో ఉండే జనాలు ఇంటి నుంచి డైరెక్ట్మెట్రో స్టేషన్‌కు...మెట్రో రైలు దిగిన వెంటనే సరాసరి ఇంటికి వెళ్లిపోవచ్చు.
స్కైవాక్ కనెక్టివిటీ..
మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా ప్యాసింజర్లు సులభంగా మెట్రోస్టేషన్లకు చేరుకునేలా, స్టేషన్ల నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లేలా పలు చోట్ల విశాలమైన స్కైవాక్ లు నిర్మించాలని భావిస్తోంది. నాగోల్–ఎయిర్‌పోర్ట్ రూట్లో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రోస్టేషన్ ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్‌కి దగ్గరలో ఎల్బీనగర్ వైపు నిర్మించనున్నారు.
ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రెండుస్టేషన్లను కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, కొత్తగా నిర్మించబోయే ఎల్ బీనగర్ (ఎయిర్ పోర్టు) మెట్రో స్టేషన్‌ను, ప్రస్తుతం కారిడార్ –1లో ఉన్న ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ ను కలుపుతూ మరో విశాలమైన స్కైవాక్ నిర్మించాలని డిసైడయ్యారు. ఈ స్కైవాక్ ద్వారా ఎల్బీనగర్ లో దిగిన వాళ్లు డైరెక్ట్ ఎల్బీనగర్(ఎయిర్‌పోర్ట్) స్టేషన్‌కు వెళ్లి ఈజీగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.
చార్మినార్‌కూ స్కైవాక్!
ఓల్డ్ సిటీ మెట్రోను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అక్కడ కూడా విశాలమైన స్కైవాక్ లు నిర్మించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ కారిడార్ లో సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్ సమీపంలో నుంచే మెట్రో వెళ్లనున్నది.
అందుకోసం ఆయా ప్రాంతాల్లో రెండు మెట్రో స్టేషన్ల నిర్మాణం జరగనున్నది. ఈ చారిత్రక ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అందుకోసం రెండు స్టేషన్ల సమీపంలో నుంచి సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్‌కు వెళ్లడానికి విశాలమైన స్కైవాక్ లు నిర్మించనున్నారు.