స్వదేశంలో శ్రీలంక జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటా వేదికగా జరిగిన తొలి వన్డేలో అప్ఘనిస్తాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 268 పరుగులకు అలౌటవ్వగా, అనంతరం లక్ష్య చేధనకు అప్ఘనిస్తాన్ 19 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచులో అఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(98) తృటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 268 పరుగులకు అలౌటైంది. చరిత అసలంక (91: 95 బంతుల్లో 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ధనంజయ డిసిల్వా (51), పతుమ్ నిశాంఖ (38) పరుగులతో ఫర్వాలేదనిపించారు. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరూఖి, పరీద్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, ముజీబ్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ తీశారు. అనంతరం 269 పరుగుల లక్ష్య చేధనకు దిగిన అఫ్ఘాన్ 46.5 ఓవర్లలోనే మ్యాచును ముగించింది. ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ (14) పరుగులతో నిరాశపరిచినా.. ఇబ్రహీం జద్రాన్ - రహమత్ షా జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ఇబ్రహీం - షా జోడి రెండో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 98 పరుగులు చేసిన ఇబ్రహీం తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. రహమత్ షా 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచుతో అంతర్జాతీయ అరంగ్రేటం చేరిన చెన్నై సూపర్ కింగ్స్ యువ బౌలర్ మతీశ పతిరాణా నిరాశపరిచాడు. 8.5 ఓవర్లు వేసిన పతిరాణా 66 పరుగులిచ్చాడు. ఏకంగా 16 వైడ్లు వేశాడు. ఇక ఈ ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం(జూన్ 4) జరగనుంది.