వీడియో: క్రికెట్ గ్రౌండ్‌లోకి ఉడుము.. మ్యాచ్‌కు అంతరాయం

వీడియో: క్రికెట్ గ్రౌండ్‌లోకి ఉడుము.. మ్యాచ్‌కు అంతరాయం

ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ అనగానే ప్రేక్షకులు హాజరవుతారు. అదేంటో కానీ, శ్రీలంకలో మ్యాచ్ అనగానే పాములు, ఉడుములు హాజరవుతున్నాయి. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్(ఎల్‍పీఎల్) టోర్నీలో పాము మరోసారి కలకలం రేపింది. వరుసగా రెండు మ్యాచ్‌లకు హాజరై అందరినీ పరేషాన్ చేసింది. తాజాగా, ఇప్పుడు నా వంతు అన్నట్లు ఉడుము ప్రత్యక్షమైంది.

కొలంబో వేదికగా శ్రీలంక - అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య ని ఏకైక టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ఉడుము అంతరాయం కలిగించింది. మాయదారి ఉడుము ఎక్కడినుంచి వచ్చిందో కానీ బౌండరీ లైన్‌ వద్ద నక్కి నక్కి పాకుతూ కనిపించింది. దీంతో అంపైర్లు ఆటను కొద్దిసేపు ఆపేశారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. రెండో రోజు ఆటలో శ్రీలంక బ్యాటింగ్ 48వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఏకపక్షం..

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 198 పరుగులకే ఆలౌట్‌ అయింది. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4 వికెట్లు తీయగా ప్రభాత్‌ జయసూరియ, అసిత్‌ ఫెర్నాండోలు తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లంక తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్‌ (141), దినేశ్‌ చండీమాల్‌ (107) శతకాలు బాదారు.