SL vs BAN: మాథ్యూస్ ఔట్‌పై భగ్గుమంటున్న క్రీడా ప్రపంచం.. ఏంటి టైమ్డ్ ఔట్?

SL vs BAN: మాథ్యూస్ ఔట్‌పై భగ్గుమంటున్న క్రీడా ప్రపంచం.. ఏంటి టైమ్డ్ ఔట్?

ఢిల్లీ, అరుణ్‌జైట్లీ వేదికగా జరుగుతున్న శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్ కొత్త వివాదాలకు దారితీస్తోంది. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ఔటైన తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రీతిలో(టైమ్డ్ ఔట్) ఎవరూ ఔట్‌ అవ్వలేదు. నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు
ఔట్‌గా ప్రకటించారు. క్రికెట్ రూల్స్ పరంగా ఇది ఔటే అయినప్పటికీ.. ఈ వివాదాస్పద నిర్ణయంపై క్రీడా ప్రపంచం భగ్గుమంటోంది.

అసలేం జరిగిందంటే..?

శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ క్యాచ్ ఔటయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ బంతిని ఎదుర్కొనే ముందు హెల్మెట్‌ బాగోలేనట్లు గుర్తించాడు. అందువల్ల మరొకటి కావాలని డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేశాడు. వెంటనే కరుణరత్నే పరిగెత్తుకొచ్చి అతనికి హెల్మెట్‌ అందించాడు. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి అప్పటికే మూడు నిమిషాలు గడిచాయి. దీంతో నిబంధనల ప్రకారం బంగ్లా కెప్టెన్ షకీబ్  అల్ హసన్, సహచర ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు.

తన నిర్ణయంపై మాథ్యూస్‌ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. షకిబ్ రూల్స్ అన్నట్లుగా మొండికేశాడు. దీంతో మాథ్యూస్‌  బంతిని ఫేస్‌ చేయకుండానే నిరాశతో పెవిలియన్ చేరాడు. ఈ ఘటనలో బంగ్లా కెప్టెన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షకీబ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా మండిపడ్డారు.  ఈరోజు ఢిల్లీలో జరిగిన ఘటన దయనీయంగా ఉందని గంభీర్ ట్వీట్ చేశారు.

ఏంటి టైమ్డ్‌ ఔట్‌..?

మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్ (ఎంసీసీ) నిబంధన 40.1.1 ప్రకారం.. ఒక బ్యాటర్‌ ఔటైనా లేదా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్‌ 3 నిమిషాల్లోపు(180 సెకన్లు) బంతిని ఫేస్‌ చేయాలి. లేనియెడల ఇన్‌కమింగ్‌ బ్యాటర్‌ను టైమ్డ్‌ ఔట్‌ కింద అంఫైర్లు ఔట్‌గా ప్రకటిస్తారు.